పార్టీ మార్పు పుకార్లు మాత్రమే

Party change is only rumours– ఎంపీగా అవకాశమిస్తే నా కుమారుడు పోటీ చేస్తాడు
– బీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం
– రాజకీయాల నుంచి రిటైర్డ్‌ అవ్వాలనుకుంటున్నా
– మీడియా చిట్‌ చాట్‌లో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొద్ది రోజులుగా వస్తున్న పుకార్లకు శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పుల్‌స్టాప్‌ పెట్టారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీ మారుతున్నాననేది అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. మంగళవారం శాసన మండలిలోని తన ఛాంబర్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ పార్టీ మారే ప్రసక్తి లేదనీ, ఇదంతా సోషల్‌ మీడియా దుష్ప్రచారమని చెప్పారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధికారంలో లేదనీ, కష్టకాలంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థులను చూసే ప్రజలు ఓట్లేస్తారనీ, అధిష్టానం ఆదేశిస్తే తన కుమారుడు అమిత్‌ రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి, నల్లగొండల్లో ఎక్కడ టికెట్‌ ఇచ్చినా పోటీ చేస్తారని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభివద్ధి చేసినా మంత్రులు కూడా భారీ తేడాతో ఓడిపోయారనీ, ఓటమికి వ్యక్తులు కారణం కాదని చెప్పారు. కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేదనీ, ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలించాయని తెలిపారు. టికెట్ల కెేటాయింపుల్లో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమనీ, ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిలో తాను ముందున్నాననీ, రెండు జాతీయ రహదారులు, నల్లగొండ, మిర్యాలగూడలో రెండు కేంద్రీయ విద్యాలయాలతో పాటు పలు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టానని తెలిపారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తేవడమంటే రాష్ట్ర హక్కులు కాలరాయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందనీ, సమస్య తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం దష్టి పెట్టాలని కోరారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులను పర్యవేక్షణ చేసి, నీటి సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. 43 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ ఎత్తిపోతల పథకంలో 20 కిలోమీటర్ల ఇన్‌లెట్‌, 13.5 కిలోమీరట్ల ఔట్‌లెట్‌ పూర్తి కాగా ఇంకా 9.5 కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నందున జిల్లాలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. శాసనమండలిలో అధికార పక్షం, ప్రతి పక్షం అనే తేడా లేకుండా అందరిని కలుపుకుని సభ సజావుగా సాగేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. జీరో అవర్‌, క్వచ్ఛన్‌ అవర్‌ మొదలగు పెండింగ్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు . మండలిలో లీడర్‌ ఆఫ్‌ హౌస్‌పై వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. 2027 నవంబర్‌లో ఎమ్మెల్సీ పదవి ముగుస్తుందనీ, ఆ తర్వాత రాజకియాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని తెలిపారు.