– అసోంలో రాహుల్ యాత్రకు బీజేపీ అవరోధాలు
– పోలీసులతో ఘర్షణకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
– కాంగ్రెస్ నేతపై కేసు నమోదుకు హిమంత బిశ్వ శర్మ ఆదేశం
గౌహతి : అసోంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యారు యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. యాత్రను అడ్డుకునేందుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. అసోంలో గురువారం యాత్ర ప్రవేశించినప్పటి నుంచి బీజేపీ కుటిల యత్నాలు చేస్తూనే ఉన్నదని కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా రాహుల్ ఐదు వేల మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం గౌహతిలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. పోలీ సులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించి కాంగ్రెస్ కార్యకర్తలు ముం దుకు కదిలారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అంతకు ముందు గౌహతి సరిహద్దు వద్ద కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ తాము నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని, శాంతి భద్రత లకు విఘాతం కలిగించ లేదని చెప్పారు. అంటే దీనర్థం తాము బలహీనులమని కాదని అన్నారు. ‘అసోం ముఖ్య మంత్రి, కేంద్ర హోం మంత్రి, ప్రధాని నిబంధనలను ఉల్లం ఘించ వచ్చు. కానీ మేం అలాంటి పని ఎన్నడూ చేయం’ అని వ్యంగ్యంగా అన్నారు. విద్యార్థులను కలవకుండా తనను అడు ్డకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసోం ముఖ్యమంత్రి ని ఆదేశించారని ఆరోపించారు. రాహుల్ ఇక్కడికి వస్తాడా లేదా అన్నది ముఖ్యం కాదనీ, తాము ఎవరి మాటలైతే వినాలని విద్యార్థులు కోరుకుంటున్నారో అందుకు అనుమతించడమే ముఖ్యమని అన్నారు. అయితే అసోం పాఠశాలలు, కళాశాలల్లో ఇది జరగడం లేదని చెప్పారు. అంతకుముందు గౌహతి రహదారుల మీదుగా యాత్రను కొనసా గించేందుకు హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పనిదినాన యాత్రను అనుమతిస్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపింది. దీనిపై రాహుల్ మండిపడుతూ ‘ఇదే రోడ్డుపై భజరంగ్‌దళ్ నడిచింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ర్యాలీ నిర్వహించారు. కానీ నా యాత్రను మాత్రం బారికేడ్లతో అడ్డుకుంటున్నారు’ అని అన్నారు.
ప్రజలను రెచ్చగొట్టారని..
మరోవైపు ప్రజలను రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. రెచ్చగొట్టే చర్యలు అస్సామీ సంస్కతిలో భాగం కాదన్నారు. తమది శాంతియుత రాష్ట్రమని, ఇలాంటి ‘నక్సలైట్ ఎత్తుగడలు’ అసోం సంస్కతికి పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు.