బీహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న

Bharat Ratna for former Bihar CM Karpuri Thakur– శతజయంతి సందర్భంగా అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ : భారతదేశపు స్వాతంత్య్ర సమరయోధుడు, జననాయక్‌, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్న వరించింది. కర్పూరి ఠాకూర్‌కు ఉన్న పాపులారిటీ కారణంగా అతన్ని జననాయక్‌ అని పిలుస్తారు. బీహార్‌లోని సమస్తిపూర్‌లో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా, భారత స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా సేవలందించారు. ఆయన శత జయంతి సందర్భంగా ఆయనకు అత్యున్నత పురస్కారాన్ని అందిస్తున్నట్టు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కర్పూరి ఠాకూర్‌ 1924 జనవరి 24న బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో జన్మించారు. మంగలి కుటుంబానికి చెందిన ఆయన తండ్రి గోకుల్‌ ఠాకూర్‌ రైతు. కర్పూరి ఠాకూర్‌ తన ప్రాథమిక విద్యను గ్రామంలోనే అభ్యసించారు. ఆ తరువాత పాట్నా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. విద్యార్థి దశ నుంచే జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కర్పూరి ఠాకూర్‌ విద్యార్థి దశ నుంచే జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 26 నెలలు జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1952లో కర్పూరీ ఠాకూర్‌ మొదటిసారిగా బీహార్‌ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. సోషలిస్టు పార్టీ టిక్కెట్‌పై తాజ్‌పురి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1967లో బీహార్‌ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోసారి 1970లో కర్పూరీ ఠాకూర్‌ బీహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. పేదలు, దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కర్పూరీ ఠాకూర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్‌లో తొలిసారిగా లాభాపేక్షలేని భూములపై రెవెన్యూ పన్నును రద్దు చేశారు.