హమాస్‌ యోథుల్లో 20శాతం మంది అమరులయ్యారు!

హమాస్‌ యోథుల్లో 20శాతం మంది అమరులయ్యారు!గాజాలో పోరాడుతున్న హమస్‌ యోధుల్లో 20శాతం మందినే ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ హతమార్చగలిగిందని అమెరికా గూఢచార వర్గాలు అంచనా వేశాయని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. అక్టోబర్‌ 7న హమాస్‌ ఇజ్రాయిల్‌ పైన దాడి తర్వాత.. ఇజ్రాయిల్‌ హమస్‌ను అంతం చేయాలన్న లక్ష్యంతో యుద్ధ చేస్తోంది. హమస్‌లో 25 వేల నుంచి 30 వేలదాకా మిలిటెంట్లు ఉన్నారనీ, వీరితోపాటు అనేక వేలమంది గాజాలో పోలీసులుగా ఉన్నారని అమెరికా ఒక రహస్య నివేదికను తయారుచేసింది. ఇజ్రాయిలీ గూఢచార సమాచారం ఆధారంగా అమెరికా ఈ అంచనా వేసిందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఐదు-పది వేల మధ్యలో హమస్‌ మిలిటెంట్లు చనిపోవటంతోపాటుగా, పది లేక పదకొండు వేల హమస్‌ యోధులు గాయపడ్డారని ఒక అమెరికా అధికారి వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు చెప్పాడు. చనిపోయిన వారి బాధ్యతలను చేపట్టవలసిన అవసరం ఏర్పడినందున మిగిలిన వాళ్ళకు పనిభారం ఎక్కువైందని జనరల్‌ జోసెఫ్‌ వోటెల్‌ అనే విశ్రాంత సైనికాధికారి అంచనా. 2007నుంచి గాజాను పాలిస్తున్న హమస్‌ కు అనేక నెలలపాటు ఇజ్రాయిల్‌ పైన దాడిచేయగలిగిన సాయుధ సామర్థ్యం ఉంది. ఇజ్రాయిల్‌ అంచనాల ప్రకారం కూడా హమస్‌ కు 30వేల మంది మిలిటెంట్‌ ఫోర్స్‌ ఉంది. వీరిలో 10వేలమంది హతులయ్యారని, 16వేల మంది గాయపడ్డారని ఇజ్రాయిల్‌ అంటోంది. గత మూడు నెలలుగా గాజాపైన అవిశ్రాంతంగా ఇజ్రాయిల్‌ కురిపిస్తున్న బాంబుల వర్షం హమస్‌ ను అంతం చేయలేకపోయిందని అమెరికా ఒప్పుకుంటోంది.