బీఆర్ఎస్ సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ లో అవిశ్వాసం వీగిపోయిందని, జమ్మికుంట మున్సిపాలిటీ పై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగిరిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ చేశారని అన్నారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోని మునిసిపాలిటీలకు అభివృద్ధిలో భాగంగా అనేక బహుమతులు కూడా వచ్చేలా కెసిఆర్ కృషి చేశారని గుర్తు చేశారు . గ్రామపంచాయతీల అభివృద్ధి విషయంలో కూడా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసానికి కూడా ఒకరిద్దరూ కారణమయ్యారని, అయినప్పటికీ కౌన్సిలర్లంతా ఏకతాటిపై ఉండి అవిశ్వాసం వీగేలా చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి జమ్మికుంట మున్సిపాలిటీపై జెండా ఎగుర వేసినందుకు గర్వంగా ఉందన్నారు.
అవిశ్వాసం వీగడానికి సహకరించిన కౌన్సిలర్లకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు మానుకొని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చడం కోసం దృష్టి సారించాలని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రజలంతా ఈ నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దని అన్నారు. 200 యూనిట్ల లోపు ఉన్న వారెవరు కరెంట్ బిల్లు కట్టడం అవసరం లేదని ముఖ్యమంత్రి తో పాటు వారి మంత్రి కూడా స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఎవరైనా కరెంటు బిల్లు కట్టాల్సిందేనని వేధిస్తే వారికి ముఖ్యమంత్రితోపాటు మంత్రి చెప్పిన వీడియోను చూపించాలని అన్నారు.
ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 9 తేదీని రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రైతులంతా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని వెంటనే రుణమాఫీ చేయాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ పేరును బోర్డులు, గోడల మీద నుంచి తొలగించినంత మాత్రాన ప్రజల గుండెలో నుంచి తొలగించలేరని అన్నారు. రైతులు రైతుబంధు ఇంకా పడలేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ్యత కలిగిన హోదాలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులను చెప్పుతో కొడతనని అనడం బాధాకరమని అన్నారు. ఎంతోమంది రైతులు ఓటు వేస్తేనే తాను గెలిచిన విషయం మరిచిపోవద్దని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనను యావత్తు తెలంగాణ రైతులతో పాటు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఇల్లంతకుంట ఎంపీపీ పావని వెంకటేష్, వీణవంక ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, జమ్మికుంట బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలినేని సత్యనారాయణ రావుల తదితరులు పాల్గొన్నారు.