మాయ మొదలైంది!

– అశ్విన్‌, జడేజా, అక్షర్‌ మ్యాజిక్‌
– ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 246/10
– యశస్వి జైస్వాల్‌ అజేయ అర్థ సెంచరీ
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 119/1
– భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు తొలి రోజు
బజ్‌బాల్‌, స్పిన్‌బాల్‌.. రెండూ టీమ్‌ ఇండియావే. స్పిన్‌ త్రయం అశ్విన్‌ (3/68), రవీంద్ర జడేజా (3/88), అక్షర్‌ పటేల్‌ (2/33) మాయజాలంతో స్పిన్‌బాల్‌ను ప్రదర్శించారు. యశస్వి జైస్వాల్‌ (76 బ్యాటింగ్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌ జోరుతో ఇంగ్లాండ్‌కు బజ్‌బాల్‌ రుచి చూపించాడు!. పరుగుల వరద, వికెట్ల జాతర సాగిన తొలి రోజు ఆటలో ఆతిథ్య భారత్‌ పైచేయి సాధించింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే కుప్పకూలగా.. టీమ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 119/1 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగుల వెనుకంజలో నిలిచింది. ఉప్పల్‌ స్పిన్‌ సవాల్‌ రసవత్తరంగా మొదలైంది. ఇంగ్లాండ్‌, భారత్‌ బ్యాటర్ల దూకుడుతో పరుగుల వరద పారగా.. పిచ్‌ నుంచి సహకారంతో స్పిన్నర్లు మాయ చేశారు. తొలి టెస్టు తొలి రోజు ఆటలోనే 365 పరుగులు నమోదు కాగా.. 87.3 ఓవర్లలో 11 వికెట్లు పతనం అయ్యాయి. నాణ్యమైన స్పిన్నర్లపై ఇంగ్లాండ్‌ మంచి స్కోరే సాధించింది. జైస్వాల్‌ దండయాత్రతో భారత్‌ పట్టు బిగించింది. నేడు ఇంగ్లాండ్‌ స్పిన్‌ త్రయం మాయ చేస్తే ఉప్పల్‌ టెస్టు రక్తికట్టనుంది. లేదంటే, రోజంతా బజ్‌బాల్‌ జోరుతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుపై కన్నేయనుంది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఉప్పల్‌ టెస్టులో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్‌పై అన్ని రంగాల్లోనూ పైచేయి సాధించింది. యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (76 బ్యాటింగ్‌, 70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్లపై దండెత్తిన యశస్వి జైస్వాల్‌ ఆ జట్టుకు బజ్‌బాల్‌ రుచి చూపించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (24) సైతం రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 23 ఓవర్లలో 119/1 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (14 బ్యాటింగ్‌), యశస్వి జైస్వాల్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా నిలిచారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది. అంతకముందు, భారత స్పిన్‌ త్రయ మాయజాలంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌, బుమ్రాలు రెండేసి వికెట్లు కూల్చారు. 64.3 ఓవర్లలోనే లాంఛనం ముగించిన భారత బౌలర్లు ఇంగ్లాండ్‌కు స్పిన్‌బాల్‌తో బదులిచ్చారు. బెన్‌ స్టోక్స్‌ (70, 88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) స్ఫూర్తిదాయక అర్థ సెంచరీతో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జానీ బెయిర్‌స్టో (37), జో రూట్‌ (29), బెన్‌ డకెట్‌ (35) రాణించారు.
ఆరంభం అదిరినా : ఇంగ్లాండ్‌ 108/3
కీలక టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు జాక్‌ క్రావ్లీ (20, 40 బంతుల్లో 3 ఫోర్లు), బెన్‌ డకెట్‌ (35, 39 బంతుల్లో 7 ఫోర్లు) బజ్‌బాల్‌ జోరు చూపించారు. తొలి ఓవర్‌ నుంచే బౌండరీల వేట సాగించారు. క్రావ్లీ మూడు ఫోర్లు బాదగా, బెన్‌ డకెట్‌ ఏడు ఫోర్లతో మెరిశాడు. 11.5 ఓవర్లలోనే ఓపెనర్లు 55 పరుగులు జోడించారు. ఓపెనర్లు వేగంగా 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా.. ఇంగ్లాండ్‌ భారీ స్కోరు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. పేసర్లపై బజ్‌బాల్‌ ఆడిన ఇంగ్లాండ్‌.. బంతి స్పిన్నర్లు అందుకోగానే విలవిల్లాడింది. బెన్‌ డకెట్‌ను ఎల్బీగా అవుట్‌ చేసిన అశ్విన్‌ ఇంగ్లాండ్‌ను తొలి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇంగ్లాండ్‌ మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. జాక్‌ క్రావ్లీని సైతం అశ్విన్‌ మాయలో పడేయగా.. ఒలీ పోప్‌ (1) కథ జడేజా ముగించాడు. దీంతో 60/3తో ఇంగ్లాండ్‌ కష్టాల్లో కూరుకుంది. లంచ్‌ లోపు మరో వికెట్‌ పడకుండా జానీ బెయిర్‌స్టో, జో రూట్‌ జాగ్రత్త పడ్డారు. జో రూట్‌పై భారత్‌ భారీ అప్పీల్‌ చేసినా.. డీఆర్‌ఎస్‌లో బయటపడ్డాడు. తొలి సెషన్లోనే స్పిన్‌ మాయ మొదలవగా.. భారత్‌ మూడు వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్‌ 28 ఓవర్లలో 108 పరుగులు జోడించింది.
స్పిన్‌బాల్‌ జోరు : ఇంగ్లాండ్‌ 215/8
ఉదయం సెషన్లోనే స్పిన్‌ మాయ మొదలవగా.. లంచ్‌ విరామం అనంతరం జోరందుకుంది. భారత స్పిన్‌ త్రయం అశ్విన్‌, జడేజా, అక్షర్‌లు సమిష్టిగా రాణించారు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు పరుగుల వేటలో దూకుడు చూపించినా.. వికెట్ల వేటలో మనోళ్లు ఎక్కడా తగ్గలేదు. నిలకడగా ఆడుతున్న జో రూట్‌ (29), జానీ బెయిర్‌స్టో (27)లను జడేజా, అక్షర్‌ సాగనంపారు. జడేజాపై రూట్‌ స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ చేజార్చుకోగా..బెయిర్‌స్టో వికెట్లను అక్షర్‌ పటేల్‌ గిరాటేశాడు. ఈ ఇద్దరి నిష్క్రమణతో ఇంగ్లాండ్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. స్పిన్‌ను బాగా ఆడే ఇద్దరు బ్యాటర్లు నిష్క్రమించినా.. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (70) తనదైన శైలి అసమాన ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. టెయిలెండర్లతో కలిసి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. బెన్‌ ఫోక్స్‌ (4), రెహన్‌ అహ్మద్‌ (13), టామ్‌ హార్ట్లీ (23)లు స్పిన్‌ మాయలో పడ్డారు. రెండో సెషన్లో భారత్‌ ఐదు వికెట్ల అదరగొట్టగా.. ఇంగ్లాండ్‌ మరో 107 పరుగులు జత చేసింది. బెన్‌ స్టోక్స్‌, మార్క్‌వుడ్‌ రెండో సెషన్లో అజేయంగా నిలిచారు.
మాయలో పడ్డారు : ఇంగ్లాండ్‌ 246/10
ఓ ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతుండగా మరో ఎండ్‌లో బెన్‌ స్టోక్స్‌ ఒంటరి పోరాటంతో అర్థ సెంచరీ సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఓ సిక్సర్‌, ఐదు ఫోర్లతో 69 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. రెండు ఫోర్ల సాయంతో మార్క్‌వుడ్‌ 11 పరుగులు చేశాడు.అంతకుముందు, టామ్‌ హార్ట్లీ (23) అలరించే ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌కు తెరపడే సమయంలో బెన్‌ స్టోక్స్‌ దూకుడు పెంచగా.. అతడి వికెట్‌తోనే ఆ జట్టు కథ ముగించాడు బుమ్రా. దీంతో 64.3 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 246 పరుగులకు కుప్పకూలింది.
యశస్వి జైస్వాల్‌ అదుర్స్‌ : భారత్‌ 119/1
మూడో సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (76 బ్యాటింగ్‌), రోహిత్‌ శర్మ (24, 27 బంతుల్లో 3 ఫోర్లు) దంచికొట్టారు. భారత బజ్‌బాల్‌ దెబ్బ ఇంగ్లాండ్‌ తెలిసేలా ఆడాడు జైస్వాల్‌. ఓపెనర్లు తొలి వికెట్‌కు 12.2 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. మూడు ఫోర్లు బాదిన రోహిత్‌ శర్మ.. జాక్‌ లీచ్‌పై దూకుడు పెంచబోయి రోహిత్‌ శర్మ నిష్క్రమించాడు. యశస్వి జైస్వాల్‌ రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 47 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. జైస్వాల్‌ దూకుడుతోనే తొలి రోజు టీమ్‌ ఇండియా పైచేయి సాధించింది. జైస్వాల్‌ తోడుగా శుభ్‌మన్‌ గిల్‌ (14 బ్యాటింగ్‌, 43 బంతుల్లో 1 ఫోర్‌) అజేయంగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. 23 ఓవర్లలో భారత్‌ ఓ వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : జాక్‌ క్రావ్లీ (సి) సిరాజ్‌ (బి) అశ్విన్‌ 20, బెన్‌ డకెట్‌ (ఎల్బీ) అశ్విన్‌ 35, ఒలీ పోప్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 1, జో రూట్‌ (సి) బుమ్రా (బి) జడేజా 29, జానీ బెయిర్‌స్టో (బి) అక్షర్‌ పటేల్‌ 37, బెన్‌ స్టోక్స్‌ (బి) బుమ్రా 70, బెన్‌ ఫోక్స్‌ (సి) భరత్‌ (బి) బుమ్రా 13, రెహన్‌ అహ్మద్‌ (సి) భరత్‌ (బి) బుమ్రా 13, టామ్‌ హార్ట్లీ (బి) జడేజా 23, మార్క్‌వుడ్‌ (బి) అశ్విన్‌ 11, జాక్‌ లీచ్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (64.3 ఓవర్లలో ఆలౌట్‌) 246.
వికెట్ల పతనం : 1-55, 2-58, 3-60, 4-121, 5-125, 6-137, 7-155, 8-193, 9-234, 10-246.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 8.3-1-28-2, మహ్మద్‌ సిరాజ్‌ 4-0-28-0, రవీంద్ర జడేజా 18-4-88-3, రవిచంద్రన్‌ అశ్విన్‌ 21-1-68-3, అక్షర్‌ పటేల్‌ 13-1-33-2.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ నాటౌట్‌ 76, రోహిత్‌ శర్మ (సి) స్టోక్స్‌ (బి) జాక్‌ లీచ్‌ 24, శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 14, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (23 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 119.
వికెట్ల పతనం : 1-80.
బౌలింగ్‌ : మార్క్‌వుడ్‌ 2-0-9-0, టామ్‌ హార్ట్లీ 9-0-63-0, జాక్‌ లీచ్‌ 9-2-24-1, రెహన్‌ అహ్మద్‌ 3-0-22-0.