ఆ కూల్చివేతలు ఆపాలి

– ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే వివక్షాపూరిత విధానాన్ని విడనాడాలి
– భారత్‌లోని అధికార యంత్రాంగాలకు ఆమ్నెస్టీ సూచన
– మహారాష్ట్రలోని మీరా రోడ్‌ బుల్డోజర్‌ చర్య తర్వాత స్పందించిన సంస్థ
న్యూఢిల్లీ : ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటూ కూల్చివేత చర్యలు సాగించే వివక్షాపూరిత విధానానికి భారత యంత్రాంగాలు వెంటనే ముగింపు పలకాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా తెలిపింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో గల పుర పాలక అధికార యంత్రాంగం 15 నిర్మాణాలను కూల్చివేసిన తర్వాతి రోజు ఆమ్నెస్టీ పై విధంగా స్పందించింది. రాష్ట్ర రాజధాని ముంబయికి దగ్గరలో ఉండే మీరా-భయండర్‌ మునిసిపాలిటీ యంత్రాంగం అక్రమ నిర్మాణాల పేరుతో మీరా రోడ్‌ నయా నగర్‌ ప్రాంతంలో కూల్చివేత డ్రైవ్‌ను చేపట్టింది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు ఆదివారం రాత్రి అక్కడ మత ఘర్షణలు జరిగాయయి. అయితే, మంగళవారం నాడు అధికార యంత్రాంగం ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని కూల్చివేత చర్యలకు దిగటం గమనార్హం. ” ఆ నిర్మాణాలు ముస్లిలవి. అయితే, ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం జరిగిన మత ఘర్షణల్లో అరెస్టయిన 13 మందితో వీటికి (నిర్మాణాలకు) సంబంధం లేదు” సామాజిక కార్యకర్త ఒకరు తెలిపారు. అయితే, ఈ నిర్మాణాలు ఫుట్‌పాత్‌లపై ఉండటం కారణంగానే వాటిని కూల్చివేసినట్టు డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌ మారుతీ గైక్వాడ్‌ అన్నారు. మత ఘర్షణల తర్వాత ముస్లింలకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసే ఏకపక్ష, వివక్షాపూరిత విధానాన్ని భారత అధికారులు అమలు చేయటం ఆందోళనకరమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియాకు చెందిన ఆకార్‌ పటేల్‌ తెలిపారు.