భారత ప్రజాస్వామ్యం ప్రాచీనమైనది!

Draupadi Murmu– న్యాయ క్రమం పట్ల విశ్వాసానికి ప్రతీక రామ మందిరం
– యువతకు అపార అవకాశాలు
– మహిళా సాధికారతతో మరింత మెరుగైన పాలన
– భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతి నుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య భావన కన్నా చాలా ప్రాచీనమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అందువల్లే భారత్‌ను ‘ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి’గా పిలుస్తారని అన్నారు. భారత రాజ్యాంగం ముందు పీఠికలోనే ‘మనం, భారత ప్రజలం’ అని ప్రారంభమవుతుందని, దాంతోనే మన రాజ్యాంగ స్వభావం స్పష్టంగా తేటతెల్లమవుతుందని అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా గురువారం జాతినుద్దేశించి ఆమె ప్రసంగిస్తూ ప్రజలకు శుభాకాక్షలు తెలియచేశారు. జీ-20 సదస్సు, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, మహిళా సాధికారత వంటి పలు అంశాలను ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు. తన సేవల ద్వారా ప్రజా జీవితాన్ని మరింత పరిపుష్టం చేసిన, భారత రత్నను ప్రకటించిన బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్‌ ఠాకూర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. న్యాయ ప్రక్రియ మొత్తంగా పూర్తయిన అనంతరం ఇటీవల అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవంతో ప్రజల విశ్వాసానికి తగిన వ్యక్తీకరణను ఇవ్వడమే గాకుండా, న్యాయ క్రమం పట్ల ప్రజలకు గల అచంచలమైన విశ్వాసానికి కూడా ప్రతీకగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని విశాల దృక్పథంతో చూసినపుడు, పునరావిష్కృతమవుతున్న భారతదేశ నాగరికత వారసత్వానికి మైలురాయిగా భవిష్యత్‌ చరిత్రకారులు దీన్ని పరిగణిస్తారని అన్నారు. చారిత్రక మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంతో ఆదర్శప్రాయమైన లింగ సమానత్వం దిశగా దేశం పురోగతి సాధిస్తోందని ముర్ము చెప్పారు. నారీ శక్తి వందన్‌ అధినియం మహిళా సాధికారతకు విప్లవాత్మకమైన సాధనంగా నిరూపించబడుతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. మన పాలనా ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా ఇది దోహదపడుతుందన్నారు. సామూహిక ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో మరింతమంది మహిళలు పాల్గొన్నపుడు ప్రజల అవసరాలకు మరింత అనుగుణంగా మన పాలనాపరమైన ప్రాధాన్యతలు వుంటాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో ప్రధాన ఆర్థిక వ్యవస్థలను పరిశీలించినట్లైతే మన జీడీపీ వృద్ధిరేటు అన్నింటికంటే అధికంగా వుందన్నారు. ప్రస్తుత, రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ పనితీరు ఇలాగే కొనసాగుతుందని నమ్మడానికి అనేక కారణాలు వున్నాయన్నారు. ‘అమృత్‌ కాల్‌’లో అనూహ్యమైన సాంకేతిక మార్పులు జరుగుతాయన్నారు. కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతిక చొరవలు మన రోజువారీ జీవితాల్లో భాగం కానున్నాయన్నారు. భవిష్యత్తులో ఆందోళన రేకెత్తించే అనేక రంగాలు వున్నాయని, అలాగే అపారమైన అవకాశాలు కూడా ముఖ్యంగా యువతకు ముందున్నాయన్నారు. సూర్యుడిపై, చంద్రుడిపై చారిత్రక మిషన్‌లతో రోదసీ రంగంలో భారత్‌ తనదైన ముద్రను వేసిందని రాష్ట్రపతి ప్రశంసించారు. ఇటీవల ముగిసిన జి-20 సదస్సు ప్రపంచ పేద దేశాల వాణిగా భారత్‌ ఆవిర్బావాన్ని నొక్కి చెప్పిందన్నారు. నూతనోత్తేజంతో, మరింత ఇనుమడించిన విశ్వాసంతో మన క్రీడాకారులు పారిస్‌ ఒలింపిక్స్‌్‌లో అద్బుతమైన ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. క్రీడాకారిణులు పతకాలు తీసుకురావడం సంతోషంగా వుందన్నారు. ఈ సందర్భంగా గతేడాది ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాలు పట్టికను ప్రస్తావించారు.అందులో 46 పతకాలు కేవలం మహిళా అథ్లెట్లే తీసుకు వచ్చారన్నారు. డిజిటల్‌ అంతరాన్ని తొలగించడంపై నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) తగిన దృష్టి పెట్టాలని కోరారు.