నవతెలంగాణ-తాంసి
పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన ఎల్మల స్వామి(38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకు ఉన్న నాలుగెకరాల భూమిలో పత్తి, కంది పంటలను వేశాడు. రెండు సంవత్సరాలుగా సరైన పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి కూడా ఎల్లలేదు. బ్యాంకుల్లో, ప్రయివేట్‌గా అప్పులు పెరగడంతో ఆందోళనకు గురయ్యాడు. బుధవారం తన చేనులోనే పురుగులమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుమారుడు చూసి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. దాదాపు రూ.5లక్షల వరకు అప్పు ఉన్నట్టు రైతు భార్య కవిత తెలిపారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు శవ పంచనామా నిర్వహించి, కేసు దర్యాప్తు చేపట్టారు.