– కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో.. : పంచాయతీరాజ్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ – వేములవాడ
సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే అని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ‘కేటీఆర్.. బుద్ధిగా నోరు అదుపులో పెట్టుకొని ప్రతిపక్ష హోదాలో పని చేరు’ అని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర ఆలయాన్ని గురువారం మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదని మంత్రి అన్నారు. దానికి సంబంధించి ఎట్లా చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. స్టేట్ ఫైనాన్స్ నిధులు ఇతర పనులకు వెచ్చించడం వల్లే సర్పంచులకు బిల్లులు పెద్దమొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నిధుల లభ్యతను బట్టి పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లించనున్నట్టు చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లు గడీల పాలన చేసిందని విమర్శించారు. కేటీఆర్ అహంకారమే బీఆర్‌ఎస్ ఓటమికి కారణమైందని.. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని, అందుకే విధ్వంస రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదని, కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు కేటీఆర్‌కు బుద్ధుందా అన్నారు. కుళ్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారన్నారు. సర్పంచులకు బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరు.. గత ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. తాము సక్రమంగా పని చేస్తేనే మళ్లీ అధికారం ఇస్తారు.. చేయకపోతే ఇవ్వరని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రతినెలా మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఆమె వెంట ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, స్థానిక నాయకులు ఉన్నారు.