తిరువనంతపురం: భారతదేశ రాజ్యాంగ పునాదిని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న యత్నాలను తిప్పికొట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. దేశం నేడు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ‘వీక్లీ థాట్’ పత్రికకు ఆయన ఒక వ్యాసం రాశారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉంది. వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కతులకు చెందినవారంతా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు భిన్నత్వంలో ఏకత్వం అనే భావన దీని నుండే ఉద్భవించిందని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆలంబనగా గణతంత్ర భారత్ అవతరించింది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, సమాఖ్య వ్యవస్థ జాతీయ విముక్తి ఉద్యమం అందించిన విలువలకు అది పట్టం గట్టింది. భారత రాజ్యాంగం జాతీయ స్వాతంత్య్ర సంగ్రామం విలువలను గ్రహించి, ప్రాథమిక హక్కులు, పౌర స్వేచ్చ, ఆర్థిక సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, నేడు వివిధ స్థాయిల్లో రాజ్యాంగ పునాదులను ధ్వంసం చేసేలా కొన్ని చొరబాట్లు జరుగుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
దేశంలోని ప్రజాస్వామ్యం, లౌకికవాదం, బహుళత్వ విలువలను, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు నిరంతరం దాడులు జరుగుతున్న తరుణంలో 75వ గణతంత్ర దినోత్సవంలోకి భారత్ అడుగిడుతోందని ఆయన పేర్కొన్నారు. సంఘ్ పరివార్ విద్వేష, విభజన రాజకీయాలను వ్యాప్తి చేస్తూ తమ రాజకీయ ఎజెండాను దేశంపై రుద్దుతోంది. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిరాకరించాలని చూస్తోంది. దేశంలోని సమాఖ్య విలువలను నీరుగార్చడం ద్వారా రాష్ట్రాల అధికారాలను హైజాక్ చేసే క్రమబద్ధమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కాలరాస్తున్నారు. ఈ దాడులు చాలావరకు బిజెపి యేతర పార్టీల పాలిత రాష్ట్రాలపైనే జరుగుతున్నాయని విజయన్ పేర్కొన్నారు.
‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అనే నినాదాన్ని ఈ కోణంలోనే చూడాలి. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసి కేంద్రానికి సర్వాధికారాలు కల్పించడమే ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అసలు ఉద్దేశం. తమకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచి షార్ట్‌కట్ ద్వారా రాష్ట్ర పరిపాలనను చేజిక్కించుకునే ఎత్తుగడ ఇది. వివిధ దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ స్థానాల ద్వారా రాజ్యసభలో ప్రాతినిధ్యం నిరంతరం పునరుద్ధరించబడుతుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా రాజ్యసభలో రాజకీయ వైవిధ్యం లేకుండా పోతుందని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే ఇలాంటి జోక్యాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన కోరారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు మళ్లీ పౌరసత్వ సవరణ అంశాన్ని ముందుకు తేవాలని సంఫ్‌ు పరివార్ చూస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం కింద దరఖాస్తుల స్వీకరణ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతోంది. పౌరసత్వ సవరణ నిబంధనలను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన తుది ముసాయిదా మార్చి 30, 2024 నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని సంఫ్‌ు పరివార్ హిందూత్వ మతపరమైన ఎజెండాలో భాగంగా చూడాలి. డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే చట్టం, ముస్లింలకు మాత్రం నిరాకరిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ స్థితిలో రాజ్యాంగంలోని లౌకిక, సమాఖ్య లక్షణాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరమెంతైనా ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు.