– మార్క్సిజం-లెనినిజం శాస్త్రీయమైన సిద్ధాంతం
– విశ్వాసాలు, మతాన్ని రాజకీయాలకు వాడుతున్న బీజేపీ
– దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఐక్య పోరాటాలు ప్రజలకు అండగా నిలిచేది ఎర్రజెండానే
– వర్తమాన పరిస్థితులు-లెనిన్ ప్రాధ్యాన్యత’ సెమినార్‌లో ఎస్.వీరయ్య
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
విప్లవోద్యమాల కాంతి శిఖరం లెనిన్ స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు, శ్రామికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో గురువారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అధ్యక్షతన ‘వర్తమాన పరిస్థితులు-లెనినిజం ప్రాధాన్యత’ అనే ఆంశంపై నిర్వహించిన సెమినార్‌కు వీరయ్య మాట్లాడారు. శ్రామికవర్గ రాజ్యం సోవియట్ యూనియన్‌ను సాధించిన ఘనత లెనిన్ నాయకత్వానికి దక్కుతుందన్నారు. భారత దేశ వర్తమాన పరిస్థితుల్ని పరిశీలిస్తే.. 2024 అనేది రెండు పరస్పర వైరుధ్య దృక్పథాలతో మొదలైందన్నారు. అందులో ఒకటి ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా పరిశ్రమలు, ఇతర అనేక రంగాల్లో సమ్మె జరగనుందని, అదే రోజున 500పైగా రైతు, వ్యవసాయ, కూలీ సంఘాల పిలుపులో భాగంగా జాతీయ గ్రామీణ బంద్ కూడా జరగనుందన్నారు. శ్రామికుల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకక విలువ కోసం దేశ వ్యాప్తంగా ఐక్య పోరాటం జరగబోతుందన్నారు. శ్రామిక వర్గాల పోరాటాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడీ ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తుందన్నారు. ఇందుకోసం ఇటు కేంద్ర ప్రభుత్వం అటు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వాలు మత విశ్వాసాలను రాజకీయం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. అయోధ్యలో రామాలయ ప్రారంభాన్ని మతపరమైన కార్యక్రమంగా కాకుండా ప్రభుత్వ కార్యక్రమంగా మార్చి ప్రధాని మోడీ చుట్టు తిప్పడం అప్రజాస్వామిక చర్య అన్నారు. వ్యక్తిగత విశ్వాసాలు, మతపరమైన విషయాల్ని స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. తమ జీవితాలు మెరుగుపడాలన్నా.. సమస్యలు పరిష్కారం కావాలన్నా శ్రామిక వర్గ ప్రజలు ఐక్యంగా పోరాడాలన్నారు. మత విశ్వాసాలు, శ్రామిక ప్రజల పోరాటాల గురించి లెనిన్ శాస్త్రీయమైన మార్క్సిస్టు దృక్పథంతో మార్గదర్శకం చూపారన్నారు. పాలకవర్గాలు పెట్టుబడిదారుల దోపిడీని కాపాడటం కోసం శ్రామిక ప్రజలు పోరుబాట పట్టకుండా జోకొట్టేందుకు ప్రయత్నిస్తాయన్నారు. మభ్యపెట్టే పెట్టుబడిదారుల కుయుక్తులను గమనించి కార్మికులు, కర్షకులు, శ్రామికులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత సంకట పరిస్థితుల్ని శాస్త్రీయ మైన మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాల ఆధారంగా అధ్యయనం చేసి విప్లవ పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. మత విశ్వాసాల నుంచి ప్రజలు బయటపడి తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లోకి వస్తారని, ఆ ప్రజలకు నాయకత్వం వహించేది ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మె, గ్రామీణ బంద్‌లో శ్రామిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు బీరం మల్లేశం, కె.రాజయ్య, అతిమేల మాణిక్యం, జి.సాయిలు, ప్రవీణ్‌కుమార్, నర్సింహులు, యాదగిరి, యాదవరెడ్డి, రేవంత్‌కుమార్, మహిపాల్, నాగేశ్వర్‌రావు, అశోక్, కృష్ణ, రాజయ్య, బాబారావు, రమేష్, రమేష్‌గౌడ్, నర్సింహ్మరెడ్డి పాల్గొన్నారు.