– త్వరలో గ్రూప్-1,2,3 రాతపరీక్షల తేదీలు ఖరారు
– గ్రూప్-4 ఫలితాల వెల్లడికి మార్గం
– పారదర్శకంగా నియామకాల ప్రక్రియ సాగేనా?
– పార్లమెంటు ఎన్నికల కోడ్‌లోపు నోటిఫికేషన్లు వస్తాయా…
– మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్
– నిరుద్యోగుల ఎదురుచూపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించడంతో నియామకాల ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది. దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. అయితే బీఆర్‌ఎస్ హయాంలో ప్రశ్నాపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ అభాసుపాలైంది. నిరుద్యోగులు, రాజకీయ పార్టీల నాయకుల నుంచి పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యుల నియామకం నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా చేపడతామని పలుమార్లు ప్రకటించింది. దీంతో కొత్త పాలకమండలిపై మరింత బాధ్యత పెరిగింది. పారదర్శకంగా నియామకాల ప్రక్రియను చేపట్టడం వారి ముందు ప్రధాన సవాల్‌గా ఉన్నది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో టీఎస్‌పీఎస్సీ ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశమున్నది. అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రానుంది. అది వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు అవకాశముండదు. దీంతో ఎన్నికల కోడ్ రావడానికి ముందే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతాయా?అన్నది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. కొత్త పాలకమండలి రావడంతో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. రాష్ట్రంలో తొలిసారిగా ప్రకటించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్షలు రెండు సార్లు రద్దయ్యాయి. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2022. ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త పాలకమండలి ఏర్పాటు కావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్షలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈనెల ఆరు, ఏడు తేదీల్లో నిర్వహించతలపెట్టిన గ్రూప్-2 రాతపరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గ్రూప్-2 రాతపరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 29న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టీఎస్‌పీఎస్సీకి కొత్త పాలకమండలి రావడంతో రాతపరీక్షల తేదీలను ఖరారు చేస్తుంది.
తెలంగాణ తొలి గ్రూప్-3 ద్వారా 1,388 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబర్ 30న నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గ్రూప్-3 రాతపరీక్షల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష గతేడాది జులై ఒకటిన నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం 2022, డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త పాలకమండలి గ్రూప్-4 మెరిట్ జాబితాను విడుదల చేయాల్సి ఉన్నది. దీనికోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.