నవతెలంగాణ – తాడ్వాయి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రసిద్దిగాంచింది. ఈ మహాజాతర వచ్చే నెలలో ఉన్నప్పటికీ ఇప్పటినుండే భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మేడారం వనదేవతలు దర్శనానికి శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. జంపన్న వాగు వద్దకు చేరుకొని పుణ్యస్నానాలాచరించి, గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వచ్చారు. సమ్మక్క, సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. వన దేవతల గద్దెలు భక్తజనంతో కిటికటలాడుతున్నాయి. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో.. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయడంపై దృష్టి సారించారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ముందస్తుగానే పోటెత్తుతున్నారు. రోజూ లక్షమందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో మేడారం రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.
క్యూలైన్ల ద్వారా దర్శనాలు: పోలీసు అధికారులు ఎండోమెంట్ అధికారులు, పూజారులు సందర్శకులకు అధిక సంఖ్యలో రావడంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్యూలైన్ల ద్వారా దర్శనాలను చేయింస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో ఎక్కువ సమయం ఉండకుండా తొందరగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. దీంతో తొక్కిస లాంటివి జరగకుండా సాఫీగా సేఫ్టీగా దర్శనం చేసుకుంటున్నారు.మేడారం జాతరకు సంబంధించిన పనులకు ఈసారి గుత్తేదారులు తక్కువగా టెండర్లు వేశారు. పనులు నెమ్మదించాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పనులు పూర్తి చేస్తామని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు.