ఘనంగా గణతంత్రం

Great republic– కర్తవ్యపథ్‌పై మువ్వన్నెల జెండా రెపరెపలు
– జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
– ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రోన్‌
– నారీ శక్తిని చాటేలా సాగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌
– పలు కంటెంజెంట్లను ముందుండి నడిపిన మహిళా అధికారులు
– దేశ సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు
– పరేడ్‌లో తెలంగాణ, ఏపీ శకటాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీ కర్తవ్యపథ్‌పై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. దేశ ప్రజలు గర్వించేలా భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సాగాయి. పరేడ్‌ ఆద్యాంతం భారత నారీశక్తిని ప్రపంచ నలుమూలలకు చాటింది. కత్తితో కవాతు చేయడం మొదలు… సాంప్రదాయ బ్యాండ్లు వాయిస్తూ, రక్షణ వ్యవస్థలను లీడ్‌ చేస్తూ, రాష్ట్ర/కేంద్ర శకటాలను వివరిస్తూ, మోటర్‌ బైక్స్‌పై ఒళ్లు గగురుపొడిచేల విన్యాసాలు ఈ వేడుకలకే హైలెట్‌ గా నిలిచాయి. కాగా 40 ఏండ్ల తరువాత… గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సారి వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యూవల్‌ మాక్రాన్‌ హాజరుకాగా… ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. తొలిసారి 112 మంది మహిళా కళాకారులు భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ.. పరేడ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రారంభమైన కవాతు దేశ నారీ శక్తిని చాటింది. తొలిసారి ఢిల్లీ పోలీస్‌, ట్రై సర్వీస్‌కు చెందిన డాక్టర్లు, నర్సులు, సెంట్రల్‌ ఆర్ముడ్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు చెందిన మహిళా కంటెంజెంట్లు తమ పాటవాలను ప్రదర్శించారు. అలాగే త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీస్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ కంటింజెంట్లకు మహిళలు నేతృత్వం వహించగా, వాళ్లు వాయించిన బ్యాండ్‌ అందర్ని ఆకట్టుకుంది.
శక్తి సామర్థ్యాలు చాటేలా…
దేశ సత్తాను, సైనిక పాఠవాలను చాటేలా త్రివిధ దళాలు భారత అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధాలు, యుద్ద ట్యాంకులు, అణ్వాయుధాలను ప్రదర్శించాయి. నాగ్‌ మిస్సైల్‌ వ్యవస్థ, మొబైల్‌ మైక్రో వేవ్‌, బీఎంపీ 2/2, ఆల్‌ టెర్రియన్‌ వెహికల్స్‌, పణిక, సర్వత్ర మొబైల్‌ బ్రైడింగ్‌ సిస్టం సగర్వంగా ముందుకు సాగాయి. అలాగే సిగల్‌ వ్యవస్థ, డ్రోన్‌ జామర్‌ సిస్టం, అడ్వాన్స్‌ రేడియో ప్రిక్వెన్సీ మానిటరింగ్‌ సిస్టం, సర్ఫేస్‌ ఎయిర్‌ మిజెస్‌ సిస్టం, మల్టీఫంక్షన్‌ రాడార్‌, మూడు అత్యాధునిక రుద్ర, ఒక ప్రచండ హెలికాప్టర్స్‌ను ఈ వేడుకల్లో ప్రదర్శించారు.
‘మథర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ థీంతో శకటాల ప్రదర్శన
‘మథర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ థీంలో భాగంగా మొత్తం 25 శకటాల కర్తవ్యపథ్‌పై సందడి చేశాయి. ఇందులో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు, 9 కేంద్ర మంత్రిత్వ శాఖ శకటాలు ఉన్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, మణిపూర్‌, మధ్యప్రదేశ్‌, ఒడిసా, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, మేఘాలయ, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. చివరిలో 54 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నింగిలో విన్యాసాలు చేశాయి.
ఇందులో మూడు ఫ్రెంచ్‌ ఎయిర్‌ ఫోర్స్‌, 46 ఇండియాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, ఒక నేవి విమానం, 4 హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రచండ్‌, తంగైల్‌, అర్జున్‌, నేత్ర, వరుణ, భీమ్‌, అంరీట్‌, త్రిశూల్‌, అమత్‌, వజ్‌ రాంగ్‌, విజరు, ఆకారంలో ఫైటర్‌ జెట్లు చేసిన విన్యాసాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇక చివర్లో రాఫేల్‌ యుద్ద విమానం నేలకు నిటారుగా నింగిలోకి దూసుకుపోతు చేసిన విన్యాసం పరేడ్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఈసారి ఇవే ప్రత్యేకతలు… 
– రాష్ట్రపతి బాడీ గాడ్స్‌(అంగరక్షక్‌ అశ్వదళం రెజిమెంట్‌) 250 ఏండ్లు పూర్తి చేసుకోనున్న సందర్బంగా …40 ఏండ్ల తర్వాత గుర్రపు బగ్గీలో పరేడ్‌కు హాజరైన ప్రెసిడెంట్‌ ముర్ము. ఆమె వెంటే వేదిక కర్తవ్య పథ్‌ చేరుకున్న ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ మాక్రాన్‌.
– నారీశక్తి, క్షిత్‌ భారత్‌, భారత్‌ – లోక్‌తంత్రకి మాతృక వంటి ప్రధాన ఇతివత్తాలతో జరిగిన వేడుకలు.
– ‘ఆవాహన్‌’ మ్యూజికల్‌ ఇనిట్రూమ్మెంట్‌ తో 112 మంది ఉమెన్‌ ఆర్టిస్ట్‌ల ప్రదర్శన.
– పరేడ్‌లో పాల్గొన్న తెలంగాణకు చెందిన ప్రధాని బాల పురస్కార్‌ గ్రహిత పెండ్యాల లక్ష్మీ ప్రియా.
– తొలిసారి 144 మందితో పరేడ్‌లో పాల్గొన్న ఆర్ముడ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ కంటెంజెంట్‌(త్రివిధ దళాలకు చెందిన డాక్టర్లు, నర్సులు)
– కవాతులో తొలిసారి సత్తా చాటిన మహిళలతో కూడిన ఢిల్లీ పోలీస్‌ కంటెంజెంట్‌, బ్యాండ్‌ టీం. ‘శాంతి, సేవా, న్యాయం’ నినాదంతో సాగిన పరేడ్‌
– తొలిసారి 148 మందితో కూడిన ఎన్‌సీసీ గర్ల్స్‌, 148 మందితో కూడిన ట్రై- సర్వీస్‌(గర్ల్స్‌ కంటింజెంట్‌, 200 ఫిమెల్‌ వాలీంటర్స్‌ తో ఎన్‌ఎస్‌ఎస్‌ మార్చింగ్‌ కంటెంజెంట్‌లు
– ఈసారి మథర్‌ ఆఫ్‌ డెమోక్రసీ పేరుతో శకటాల ప్రదర్శన. ‘డెమోక్రసీ ఎట్‌ ది గ్రాస్‌ రూట్స్‌’ నినాదంతో తెలంగాణ శకటం ప్రదర్శన.