త్వరలో డ్రైవర్‌, కండక్టర్ల నియామకాలు

Recruitment of drivers and conductors soon– మహాలక్ష్మి స్కీం ద్వారా రోజుకు 27 లక్షల మంది మహిళలు ప్రయాణం
–  టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ‘మహాలక్ష్మి’ స్కీం ద్వారా రోజుకు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. శుక్రవారంనాడిక్కడి బస్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. ‘మహాలక్ష్మి’ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లో సమర్థవంతంగా అమల్లోకి తెచ్చామనీ, సంస్థకు చెందిన 7,200 పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ స్కీంను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ స్కీం సక్సెస్‌కు సంస్థ అధికారులు, సిబ్బందే కారణమనీ, వారి సేవల్ని ప్రభుత్వం కూడా మెచ్చుకున్నదని తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా 1,325 డీజిల్‌, 1,050 ఎలక్ట్రిక్‌ బస్సులు సహా మొత్తం 2,375 బస్సుల్ని విడతల వారీగా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌ను చేపడతామన్నారు. కారుణ్య నియామకాల ద్వారా 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించామని అన్నారు. వారికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం కరీంనగర్‌లో నియామకపత్రాలు అందజేస్తారని తెలిపారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్‌ ప్రస్తుతం కొనసాగుతున్నదనీ, ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని వివరించారు. ఆర్టీసీ సిబ్బంది పెండింగ్‌ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందనీ, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ సందర్భంగా విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం అధికారులకు ఆయన మెడల్స్‌ అందచేసి, సత్కరించారు. గౌరవవందనం స్వీకరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాల్లో అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన హకీంపేట, చెంగిచర్ల, కంటోన్మెంట్‌ డిపో మేనేజర్లకూ ప్రశంసా పత్రాలు ఇచ్చి, సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) డాక్టర్‌ వీ రవీందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు మునిశేఖర్‌, కష్ణకాంత్‌, ఫైనాన్స్‌ అడ్వయిజర్‌ విజయ పుష్ప, సీపీఎం ఉషాదేవి, తార్నాక ఆస్పత్రి ఓఎస్డీ డాక్టర్‌ సైదిరెడ్డి, సీటీఎం జీవనప్రసాద్‌, సీసీఓఎస్‌ విజయభాస్కర్‌, సీఈఐటీ రాజశేఖర్‌, సీటీఎం కమర్షియల్‌ సుదర్శన్‌, సీసీఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.