ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం: హెచ్ఎం శ్రీనివాస్

నవతెలంగాణ – పెద్దవంగర
పది లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ కొనసాగిస్తున్నామని మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుధారపు శ్రీనివాస్ అన్నారు. వేక్ అప్ కాల్ లో భాగంగా శనివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ఎడ్ల నాని తో జిల్లా విద్యాశాఖాధికారి రామారావు ఉదయం 5 గంటలకు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఈవో ఉపాధ్యాయులు, విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారని హెచ్ఎం తెలిపారు. ఈ మేరకు హెచ్ఎం మాట్లాడుతూ..ప్రతీ ఉపాధ్యాయుడు దత్తత తీసుకున్న విద్యార్థులకు ఉదయం 5 గంటలకు వేక్ అప్ కాల్ చేయాలన్నారు. ఉదయం ప్రశాంత వాతావరణంలో ఏకాగ్రతతో చదవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. ఫిబ్రవరి 5 నుండి గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు, పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.