సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం

– సర్పంచ్‌ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి
– కడ్తాల్‌ గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశం
నవతెలంగాణ-ఆమనగల్‌
సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కడ్తాల్‌ సర్పంచ్‌ గూడూరు లక్ష్మీ నరసింహరెడ్డి అన్నారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడచిన ఐదు సంవత్సరాలలో గ్రామపంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. ఆదాయ వ్యయాలను చదివి పంచాయతీ పాలక మండలితోపాటు ప్రజలకు వివరించారు. గ్రామంలో ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులను సమావేశం దృష్టికి తీసుకువచ్చి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామం, సీసీ రోడ్లు, వీధిలైట్లు, అంతర్గత మురుగు కాలువల నిర్వహణ, పురాతన కట్టడమైన బూర్జూ నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, వివిధ కుల సంఘాలకు కమిటీ భవనాలు, ముఖ్యంగా తాగునీటి కొరకు తీసుకున్న జాగ్రత్తలు, కరోన సమయంలో సిబ్బంది మరియు పాలకవర్గం పనితీరుతో పాటు వివిధ అభివృద్ధి పనుల గురించి వివరించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ తీరును, సిబ్బంది విధులను గుర్తు చేస్తూ సిబ్బందిని అభినందించారు. ఐదు సంవత్సరాల సమయంలో రాజకీయాలకతీతంగా సహకరించిన పాలకవర్గం సభ్యులను, పంచాయతీ కార్మికులు, సిబ్బందిని, కార్యదర్శిని శాలువాలతో సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రామకృష్ణ, వార్డు సభ్యులు నరేందర్‌ రెడ్డి, మల్లయ్య, బిక్షపతి, మహేష్‌, సువర్ణ, గణేష్‌, దీపికా రెడ్డి, ఎట్టమ్మ బుజ్జమ్మ, కోఆప్షన్‌ సభ్యులు వెంకటయ్య గౌడ్‌, నాయకులు లాయఖ్‌ అలి, క్యామ వెంకటయ్య, రామచంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేష్‌, గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది, పాల్గొన్నారు.