– మంత్రి సీతక్కకు ఐద్వా వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అభయ హస్తం డబ్బులను మహిళల బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాలని ఆలిండియా ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షులు కేఎన్ ఆశాలత, సహాయ కార్యదర్శి ఎం వినోద, కె నాగలక్ష్మితో కూడిన బృందం శనివారం హైదరాబాద్‌లో మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, సభ్యులను వెంటనే నియమించాలని కోరారు. రాష్ట్రంలో నేటికీ మహిళలు, బాలికలపట్ల వివక్ష, లైంగిక దాడులు, హత్య లు, కిడ్నాప్‌లు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరకట్న వేధింపులకు ఎంతోమంది మహిళలు బలవు తున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలన, వృద్ధాప్య సమయం లో పెన్షన్, బీమా సౌకర్యంతోఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. 18 నుంచి 53 ఏండ్ల వయస్సున్న 47,05,672 మంది తెల్లరేషన్ కార్డు దారుల నుంచి ఏడాదికి రూ.308 వసూలు వేసిందని తెలిపారు. కార్పర్ ఫండ్ నుంచి వచ్చే వడ్డీతో వీరి నెలవారీ పెన్షన్, వారి పిల్లలకు స్కాలర్ షిప్పు, ఎల్‌ఐసీ ద్వారా జీవిత బీమా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఆ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. పేద మహిళలు చెల్లించిన డబ్బు తిరిగి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రూ. ఆరు కోట్ల అభయం హస్తం బకాయిలను లబ్దిదారుల అకౌంట్లలో జమచేయాలని లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేటికీి సుమారు నాలుగు వేల మారు మూల గ్రామాలు, గూడెలకు, తండాలకు బస్సు సౌకర్యం లేదనీ, ఆ గ్రామాలకు బస్సు సర్వీసులు కల్పించాలని కోరారు.