మాలె : పార్లమెంట్లో ఎంపీలు తీవ్రంగా విమర్శలు చేసుకోవటం వింటున్నాం. కానీ చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకోవటం చూశారా? మాల్దీవుల పార్లమెంట్లో అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు బాహాబాహికి దిగారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్లోని మంత్రుల సంబంధించి పార్లమెంట్ ఆమోదం కోసం ఆదివారం ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం మాల్దీవుల ప్రజా ప్రతినిధుల ఘర్షణ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, ప్రభుత్వ అనుకూల పార్టీ ప్రొగ్రెసీవ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ ఎంపీలకు… ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయిన్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీల మధ్య గొడవ జరిగింది. అయితే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్లో నలుగురు మంత్రుల ఆమోదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేశారు.
ఈ క్రమంలోనే పీఎన్సీ ఎంపీ షహీమ్.. ఎండీపీ ఎంపీ ఇసా కాలు పట్టుకొని నేలపై పడగొట్టాడు. దీంతో ఇసా… షహీమ్ మెడపై పిడిగుద్దులు గుద్దాడు. సహచర ఎంపీలు వారిగొడవను శాంతింపచేశారు. తీవ్రంగా గాయపడ్డ షహీమ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మంత్రి వర్గంలోని మంత్రులకు ఆమోదం తెలపకపోవటంతో పాటు స్పీకర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేశాయి. మరోవైపు కెబినెట్లో మంత్రులకు ఆమోదం తెలపకపోవటం ప్రజా సేవలకు విఘాతం కల్పించడమేనని ప్రతిపక్షాలపై అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ పార్టీ మండిపడుతోంది.