సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

– ముందస్తు బెయిల్‌ సవాల్‌ పిటిషన్‌ కొట్టివేత
– దర్యాప్తుకు నిరాకరిస్తే బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ దాఖలు చేయొచ్చు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. చంద్రబాబుకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరుచేయగా.. దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటీషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది.