ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ పేరుతో నకిలీ ఎఫ్‌బీ ఖాతాలు

ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ పేరుతో నకిలీ ఎఫ్‌బీ ఖాతాలు– సైబర్‌ క్రైమ్‌లో కేసు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రోజుకో తీరులో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు సృష్టించారు. రెండు అకౌంట్లను సృష్టించిన దుండగులు డబ్బులు వసూలు చేసేందుకు పలువురికి షేర్‌ చేశారు. వెంటనే గుర్తించిన అధికారులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్‌ ఏసీపీ మారుతి ఆదేశాలతో సోమవారం కేసు నమోదు చేసిన అధికారులు నకిలీ ఖాతాలను తొలిగించారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో సమాచారం పంపించినా, షేర్‌ చేసినా వాటిని క్లిక్‌ చేయొద్దని ఏసీపీ సూచించారు. ఎవరైనా డబ్బులు పంపించాలని కోరితే వెంటనే అనుమానించాలని, అలాంటి ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.