– ‘గ్యారంటీ’ ఇచ్చిన కేంద్ర మంత్రి శంతను ఠాకూర్
కొల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వారం రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, వాటర్‌వేస్ శాఖ మంత్రి శంతను ఠాకూర్ ‘గ్యారంటీ’ ఇచ్చారు. ఈ చట్టం 2019లో పార్లమెంట్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో ఠాకూర్ విలేక రులతో మాట్లాడుతూ ‘అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైంది. ఇప్పుడు నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను. రాబోయే ఏడు రోజుల్లో బెంగాల్ లో మాత్రమే కాదు…దేశమంతటా సీఏఏను అమలు చేస్తాం. ఈ చట్టాన్ని ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేస్తాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు సంధించారు. తృణమూల్ ప్రభుత్వం అనేక హమీలు ఇచ్చినప్పటికీ మతువా తెగకు చెందిన వారికి ఓటు హక్కు, ఆధార్ కార్డులు నిరాకరించిందని చెప్పారు.
‘1971 తర్వాత బెంగాల్‌కు వలస వచ్చిన వారికి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తరచుగా చెబుతూనే ఉన్నారు. వారంతా దేశ పౌరులేనని అంటున్నారు. అయితే వేలాది మందికి ఇప్పటికీ ఓటరు కార్డులు లేవు. వారంతా మతువా తెగకు చెందిన వారు. బీజేపీ మద్దతుదారులు. అందుకే వారికి ఓటర్ ఐడీ కార్డులు నిరాకరిస్తున్నారా? రాజకీయ అజెండాతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తోంది. భవిష్యత్ తరాల వారికి భద్రత కల్పించాలంటే 1971 తర్వాత దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలి. అందుకే కేంద్రం సీఏఏ తీసుకొస్తోంది. అందుకే ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది’ అని ఠాకూర్ తెలిపారు.
సీఏఏ అంటే…
పౌరసత్వ సవరణ చట్టాన్ని వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు కన్పించడం లేదు. సీఏఏ అమలుకు సంబంధించిన నియమ నిబంధనల్ని కేంద్రం ఇప్పటి వరకూ రూపొందించనే లేదు. ఈ చట్టాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టానికి పార్లమెంట్ ఆమోదం లభించిన వెంటనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు మన దేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
ఎవరీ మతువాలు ?
మతువాలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన నామశూద్ర తెగ వారు. వీరు మన దేశంలోకి పెద్ద సంఖ్యలో వలస వచ్చారు. దేశ విభజన సమయంలోనూ, ఆ తర్వాత 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలోనూ వీరు భారత్‌లో ప్రవేశించారు. బెంగాల్‌లో మూడు కోట్ల మంది మతువాలు ఉండగా వారిలో ఎక్కువ మంది ఉత్తర 24 పరగణాలు, నదియా జిల్లాల్లోనే ఉంటున్నారు. వీరు మన దేశానికి రావడానికి దారితీసిన పరిస్థితుల కారణంగా వారిలో చాలా మందికి భారత పౌరసత్వం లభించలేదు.