
రెండేళ్లకోసారి జరుగు మేడారం మహా జాతరకు తాత్కాలిక నిర్మాణాలతో ప్రజాధనం వృధా అవుతుందని, శాశ్వత నిర్మాణాలతో సందర్శకులకు సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దిగ్గి చిరంజీవి అన్నారు. బుధవారం మండలంలోని మేడారం జంపన్న వాగు పరిసర ప్రాంతాలను, జంపన్న వాగులోని ఇసుక లేవలింగ పనులు, ఇసుక బస్తాలతో వేస్తున్న అడ్డుకట్ట పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చిరంజీవి మాట్లాడుతూ ప్రతి రెండిళ్లకి ఒకసారి మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న తాత్కాలిక నిర్మాణాల వలన కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లలో పోసినట్టు అవుతుందని, జాతరలో శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రభుత్వ, ప్రజా ధనం వృధా కాకుండా ఉంటుందని తెలిపారు. జాతరలో స్నానాలు చేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్న చిన్న చిన్న ఆనకట్టలు ఏర్పాటు చేయడం వల్ల వర్షాకాలంలో అవి కొట్టుకుపోతున్నాయి మళ్లీ వచ్చే జాతరకు భక్తుల సౌకర్యార్థం ఇదే పని పునరావృతం అవుతుంది అందువల్ల గతంలో వెచ్చించిన ఖర్చు విలువ లేకుండా పోయిందని, ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాల వలన తెలియకుండానే కోట్లాది రూపాయలు గంగ పాలవుతున్నాయని మండిపడ్డారు. జంపన్న వాగులో ఐదు కోట్ల నిధులతో ఐబి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులు గోదారిలో పూసినట్టేనని ఎద్దేవ చేశారు. కాంట్రాక్టర్ అధికారులు రాజకీయ నాయకులు కమిషన్ల కోసమే ఈ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు ప్రజాధనం వృధా కాకుండా శాశ్వత నిర్మాణాల వైపు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. స్నానఘట్టాల వద్ద మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటుచేసిన చేస్తున్న రేకుల నిర్మాణాలు కాకుండా ఇటుకలతో శాశ్వత నిర్మాణాలు చేపట్టి , ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని ఆయన అన్నారు. జాతరకు నెలరోజుల ముందు నుండే భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని, పనులు పూర్తి కాలేదని, సందర్శకులకు ఇప్పటికీ సరైన సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. వారం రోజుల్లోగా అన్ని పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి అధికారులు వారి పని నిబద్ధతను చాటుకోవాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.