– గెజిట్ అధికారులను కేటాయించిన జిల్లా యంత్రాంగం
– ఎమ్మార్వో కు తంగళ్ళపల్లి, పద్మనగర్
– ఎంపీడీవో కు బస్వాపూర్, బాలమల్లు పల్లె
– స్పెషలాఫీసర్, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్
– 3న మంత్రి మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం పూర్తవ్వడంతో ప్రత్యేక అధికారులు పాలన నేటితో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలన అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే మేజర్ గ్రామపంచాయతీలకు మండల అధికారులను నియమించడమే కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు గెజిట్ అధికారులను గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులుగా జిల్లా యంత్రాంగం నియమించారు.జిల్లాస్థాయి అధికారులు ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులుగా ఉంటూ ప్రత్యేక పాలన సవ్యంగా కొనసాగేలా చూడనున్నారు. ఈ నెల 3న రాష్ట్రపంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి సీతక్క వీడియో కాస్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేయనున్నారు.ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు స్పెషలాఫీసర్లను ఖరారు చేశారు. పాలక వర్గం రద్దవ్వడంతో నేటి నుంచి పంచాయతీ పాలనా వ్యవహారాలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులన్నీ ప్రత్యేక అధికారులు ద్వారా కొనసాగనున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం గురువారం తో ముగిసింది. ఇక నుంచి ప్రత్యేక అధికారుల పాలన నేటి నుండి గ్రామాల్లో కొనసాగనుంది. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులున్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చింది. తెలంగాణ వచ్చాక ప్రత్యేక అధికారుల పాలన పెట్టడం రెండో సారి అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న 255 గ్రామపంచాయతీలో ప్రత్యేక పాలన శుక్రవారం నుండి మొదలుకానుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల్ని నియమించినందున వారి సారధ్యంలోనే పంచాయతీల పాలన వ్యవహారాలు నడవనున్నాయి.ప్రత్యేక అధికారుల పాలన గ్రామ పంచాయతీ పాలక వర్గంలోని సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యుల పదవి కాలం ముగిసినందున ప్రత్యేక అధికారులు ఆ భాద్యతల్ని నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్న 255 గ్రామ పంచాయతీల పరిపాలన వ్యవహారాలు, ప్రజల అవసరాలకు సంబంధించి తాగునీరు, మురుగు కాల్వలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పచ్చదనం,పన్నుల వసూళ్లు, నిర్మాణాలకు అనుమతులు, ఇతర పనులన్నీ కూడా ప్రత్యేక అధికారులు నిర్వహించనున్నారు. మేజర్ గ్రామపంచాయతీలకు గెజిటెడ్ అధికారుల్ని ప్రత్యేక అధికారులు గా నియమింపబడ్డారు. ప్రత్యేక అధికారులుగా జిల్లా యంత్రాంగం ఎంపీడీవో, ఎంఆర్ఓ, తో పాటు ఎంఈఓ,డిప్యూటీ తహసీల్దారులు, ఆర్ డబ్యూఎస్ ఎఈ, ఇరిగేషన్ ఏఈ, పి ఆర్ ఏ ఈ, గ్రామీణాభివృద్ధి, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ,పశువైద్యాధికారి, వ్యవసాయ శాఖ అధికారుల ను నియమిస్తున్నారు. తంగళ్ళపల్లి మండలంలో 30 గ్రామ పంచాయతీలకు 15 మంది ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులు నియమించారు. ఒక్కో ప్రత్యేక అధికారికి రెండు గ్రామాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వీరంతా కూడా నేటి నుంచి కేటాయించిన గ్రామాలలో అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు పద్మనగర్ గ్రామపంచాయతీ లకు ప్రత్యేక అధికారిగా తహసిల్దార్ వెంకటలక్ష్మి, బస్వాపూర్,బాలమల్లుపల్లె గ్రామపంచాయతీలకు ఎంపీడీవో లచ్చాలు బాధ్యతలు స్వీకరించనున్నారు.ఆయా గ్రామాలకు కేటాయించిన అధికారులు ఇప్పటికే ఆ గ్రామాలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల గురించి తెలుసుకుంటున్నారు. పదవికాలం ముగిసినందున గ్రామ పంచాయతీలకు సంబంధించిన రికార్డులను పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కానీ కొన్ని గ్రామపంచాయతీల రికార్డులను కొందరు సర్పంచులు పంచాయతీ కార్యదర్శుల వద్ద నుండి బలవంతంగా లాక్కెళ్ళినట్లు పూర్తిస్థాయిలో పంచాయతీకి సంబంధించిన రికార్డులను పంచాయతీ కార్యదర్శులకు సర్పంచ్లు ఇవ్వలేదు అని ఆరోపణలు సర్పంచుల పదవీకాలం ముగియడంతో తర్వాత వచ్చే సర్పంచులు వారికి రావలసిన బిల్లులు చెల్లించారు అనే నిబంధనతో రికార్డులను గ్రామపంచాయతీలకు ఇవ్వకుండా అట్టే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనున్నందున నిధుల డ్రా, జమలకు సంబంధించి చెక్ పవర్ ను ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సంతకాల కీలను ఇవ్వనుంది. గతంలో పాలక వర్గంలోని సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెప్పవర్ ఉండేది. ప్రస్తుతం పాలక వర్గం లేనందున ఇద్దరు కూడా ప్రభుత్వ అధికారులు గ్రామ పంచాయతీకలు వచ్చే రాష్ట్ర ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్ నిధుల్ని డ్రా చేయడం, జమ చేయడం, ఖర్చు చేయడమంతా వీరిద్దరి పర్యవేక్షణలో జరగనుంది. నిధుల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరిగినా చట్టపరంగా జాయింట్ చెక్ పవర్ ఉన్న ప్రత్యేక అధికారి, కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక పాలన అమల్లోకి రానున్న నేపథ్యంలో సర్పంచ్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సర్పంచ్లకు మరికొంత కాలం పదవి బాధ్యతలు అప్పజెప్పాలని కోరుతూ వచ్చిన సర్పంచ్లు ఏకంగా కోర్టు మెట్లెక్కారు. ఐదేళ్ల పదవి కాలంలో గ్రామాభివృద్ధి, ప్రజా అవసరాల కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొ జీపీలో కనీసం పది లక్షల మేరకు బిల్లులు రావాలి.ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు, వైకుంఠదామాలు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు, మన ఊరు-మన బడి కింద వివిధ రకాల పనుల్ని సర్పంచ్లు చేశారు.సకాలంలో బిల్లులు రాకపోవడంతో సర్పంచ్ లు అప్పులు చేయాల్సి వచ్చింది. అట్టి బిల్లుల్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో పక్క ఐదేళ్ల పదవి కాలం ముగిసినందున వెంటనే స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలనే డిమాండ్ కూడా ఉంది.