బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా నూతన చిత్రం ప్రారంభమైంది. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 2గా మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ఈ సినిమా ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టగా, నిర్మాత ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ, ‘భారతీయ సినిమాలో ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్. చాలా చాలా కొత్త పాయింట్’ అని అన్నారు. ‘మాలాంటి కొత్త వాళ్ళని ఎం3 మీడియా ఎంతో ప్రోత్సహించింది’ అని దర్శకుడు మాల్యాద్రి రెడ్డి చెప్పారు. అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఎలా ఉండబోతోందని మేం చెప్పడం కంటే.. మూవీ చూసి మీరే చెప్పాలి’ అని తెలిపారు. ‘అవకాశం ఇచ్చిన మేకర్స్‌కు థ్యాంక్స్’ అని సుప్రీత చెప్పారు.