– గెలుపే లక్ష్యంగా టీమ్ ఇండియా
– ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీశ్ జట్టు దూకుడు
– భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు నేటి నుంచి
– ఉదయం 9.30 నుంచి స్పోర్ట్స్18లో…
హైదరాబాద్‌లో స్పిన్బాల్పై బజ్‌బాల్ సూపర్ హిట్ కొట్టింది. టీమ్ ఇండియా ఓటమెరుగని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్ అనూహ్య విజయంతో టెస్టు సిరీస్‌ను గొప్పగా మొదలెట్టింది. తొలి టెస్టులో ఊహించని ఓటమికి కీలక ఆటగాళ్ల గాయాలు జతకలవటంతో టీమ్ ఇండియా కాస్త నైరాశ్యంలో పడింది. విశాఖ తీరంలో కుర్రాళ్ల అండతో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న రోహిత్‌సేన కోసం బజ్‌బాల్ సవాల్ ఎదురుచూస్తోంది. భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు నేటి నుంచి ఆరంభం.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి లేడు. తొలి టెస్టులో రాణించిన కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. మహా మాయగాడు రవీంద్ర జడేజా అందుబాటులో లేడు. ప్రతిభావంతులైన శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో లేరు. ఇంగ్లాండ్‌తో విశాఖ టెస్టు ముంగిట టీమ్ ఇండియా పరిస్థితి ఇది. గతంలో విశాఖలో టెస్టు ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే హిట్ కొట్టిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టెస్టు జట్టు సారథిగా అదే ఫలితం పునరావృతం చేయాలని చూస్తున్నాడు. లోకల్ బారు భరత్‌కు తోడు తెలుగింటి తేజం రోహిత్ శర్మ విశాఖ టెస్టులో ఫ్యాన్స్ ఫేవరేట్స్‌గా బరిలోకి దిగుతున్నారు.
నవతెలంగాణ-విశాఖపట్నం
ఆ ఇద్దరు మెరవాలి
హైదరాబాద్ టెస్టు ఓటమి కంటే ఎక్కువగా భారత్‌ను వేధిస్తున్న సమస్య శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్. వైట్‌బాల్ ఫార్మాట్లో పరుగుల వరద పారించిన ఈ ఇద్దరు.. రెడ్‌బాల్ క్రికెట్లో ఇబ్బంది పడుతున్నారు. సహజంగానే స్పిన్ పిచ్‌లపై శ్రేయస్ అయ్యర్‌కు మంచి రికార్డుంది. స్పిన్నర్లపై వేగంగా, దూకుడుగా పరుగులు చేయటంలో శ్రేయస్ అయ్యర్ దిట్ట. కానీ, ఇంగ్లాండ్ స్పిన్నర్లపై అయ్యర్ ఆశించిన ప్రదర్శన చేయలేదు. శుభ్‌మన్ గిల్ పరిస్థితీ ఇంతే. వైట్‌బాల్ ఫార్మాట్ తరహాలో వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనలో కనిపిస్తున్న గిల్.. అనవసర షాట్లకు వికెట్ పారేసుకుంటున్నాడు. గిల్, అయ్యర్ ఇద్దరూ దూకుడు, షాట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ కష్టాలు తీరినట్టే. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లు దూకుడుగా ఆడుతున్నారు. ధనాధన్ ఓపెనింగ్ భాగస్వామ్యాలు నమోదు చేస్తూ మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి తొలగిస్తున్నారు. కె.ఎస్ భరత్ హైదరాబాద్ టెస్టులో రాణించినా.. అద్భుత ఇన్నింగ్స్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సొంత మైదానంలో భరత్ అటువంటి అసమాన ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. ఇక కెఎల్ రాహుల్ స్థానంలో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటం ఖాయంగా అనిపిస్తోంది. నెట్స్‌లో స్పిన్నర్లపై ఎక్కువగా సాధన చేసిన సర్ఫరాజ్.. నేడు ఇంగ్లాండ్‌పై ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అశ్విన్, అక్షర్‌లకు తోడుగా వాషింగ్టన్ సుందర్ స్పిన్ బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
భయమెరుగని ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ అతిపెద్ద బలం ఆ జట్టు భయమెరుగని క్రికెట్. కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ ఓటమికి ఏమాత్రం భయపడటం లేదు. ఓటమి ఎదురైనా.. గెలుపు కోసం ప్రయత్నించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఆ తెగువే హైదరాబాద్ టెస్టులో మంచి విజయాన్ని కట్టబెట్టింది. భారత స్పిన్నర్ల మాయను ఎదురొడ్డి బ్యాటర్లు పరుగులు చేయటం, భారత బ్యాటర్లను మాయలో పడేటం.. ఇదే ఇంగ్లాండ్ గెలుపు ఫార్ములా. స్పిన్ పిచ్‌లు అంటూ గోల చేయకుండా.. స్పిన్ పరీక్షను స్పిన్‌తోనే ఎదుర్కొనేందుకు అద్భుతంగా సిద్ధమైంది. తొలి టెస్టు హీరో ఒలీ పోప్, టామ్ హర్ట్లీలు విశాఖలోనూ ఇంగ్లాండ్ ట్రంప్ కార్డులే. జాక్ క్రావ్లీ, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ ఫామ్‌లో ఉన్నారు. జోరూట్ సైతం ఈ త్రయానికి తోడైతే విశాఖలో భారత్‌కు గట్టి సవాల్ విసరవచ్చు. జానీ బెయిర్‌స్టో బజ్‌బాల్‌తో ఎప్పుడు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. బౌలింగ్ విభాగంలో మరోసారి ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో నిలిచారు. ఏకైక పేసర్‌గా మార్క్‌వుడ్ స్థానంలో జేమ్స్ అండర్సన్ ఆడనున్నాడు. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న జాక్ లీచ్ స్థానంలో బషీర్ అరంగ్రేటం చేయనున్నాడు. రెహన్ అహ్మద్, టామ్ హర్ట్లీలతో కలిసి జో రూట్ సైతం మాయ చేయనున్నాడు.
పిచ్, వాతావరణం
భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌కు సంప్రదాయ ఉపఖండ పిచ్‌ను సిద్ధం చేశారు. విశాఖ పిచ్ సహజంగానే స్పిన్‌కు అనుకూలం. తొలి రెండు రోజుల ఆటలో బ్యాటర్లకు కాస్త మొగ్గు ఉండవచ్చు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. నాల్గో ఇన్నింగ్స్‌లో ఇక్కడ పరుగుల వేట కష్టసాధ్యం అవనుంది. టెస్టు మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది.
బాల్‌బాయ్ టూ పోస్టర్‌బాయ్!
కె.ఎస్ భరత్. భారత టెస్టు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు. 30 ఏండ్ల శ్రీకర్ భరత్ సొంత మైదానం విశాఖపట్నంలో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. హైదరాబాద్ టెస్టులో వికెట్ కీపర్‌గా జట్టులో నిలిచిన భరత్.. విశాఖ టెస్టులోనూ వికెట్ కీపింగ్ గ్లౌవ్స్ అందుకోనున్నాడు. విశాఖలోని డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో బాల్‌బాయ్‌గా అంతర్జాతీయ మ్యాచులకు పని చేసిన భరత్.. ఇప్పుడు అదే స్టేడియంలో టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆంధ్ర ఆటగాడు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సందర్భాన్ని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వేడుకగా జరుపుతోంది. విశాఖ నలువైపులా కె.ఎస్ భరత్ పోస్టర్లతో టెస్టు మ్యాచ్‌కు క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. బాల్‌బాయ్ ఇప్పుడు ఆంధ్ర క్రికెట్‌కు పోస్టర్‌బాయ్‌గా నిలిచాడని సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ ముంగిట భరత్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం సన్మానించింది. ‘ సొంత మైదానంలో టెస్టు మ్యాచ్ ఆడటం గొప్పగా అనిపిస్తుంది. కానీ భారత జట్టుకు ఇది నాకు ఇంకో సవాల్ వంటిదే. సొంత మైదానంలో అభిమానుల నడుమ ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమే. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవటం కీలకం’ అని కె.ఎస్ భరత్ అన్నాడు.