
నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ కు చెందిన విప్లవకవి, నక్సల్స్ భావజాల రచయిత రిక్కల సహదేవరెడ్డి కనిపించకుండా పోయి 35 సంవత్సరాలు గడుస్తున్నా శవం కూడా తమకు లభించలేదని,సహా దేవ రెడ్డి ఏమైనటీని అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సహదేవ రెడ్డి కుటుంబ సభ్యులను విమలక్క బృందం పరామర్శించారు. 35 సంవత్సరాల క్రితం తమ సహోదరుడు సహదేవరెడ్డి ఎదుర్కొన్న ఇబ్బందులను, కనిపించకుండా పోయిన విషయాన్ని సహదేవ రెడ్డి సహోదరణిలు విమలక్కకు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న సహదేవరెడ్డి చిత్రపటాన్ని చూసిన విమలక్క ఆనాటి రోజులను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. సహదేవ రెడ్డి రచించిన రక్తచలన సంగీతం పుస్తకం ఇటీవల ఓచోట లభ్యమైందని ఆ పుస్తకాన్ని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అందించామని జనశక్తి అగ్రనేత అమర్ తెలిపారు. అమరవీరుడు సహదేవరెడ్డి రచించిన ఈ పుస్తకాన్ని ఈనెల 28వ తేదీన హైదరాబాద్ లో తిరిగి ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించి ఆవిష్కరణకు రావాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సహదేవరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, రచయితలు, తదితరులు ఉన్నారు.