– రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పదేండ్ల పాలనలో పేదల సొంతింటి కల నేరవేరలేదని రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌లో అర్హుల్కెన వారికి ఇండ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకువచ్చి బస్తీలు అద్దె ఇండ్లలో ఉండేవారి సొంతింటి కలను నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐదేండ్లలో దేశంలోని పేదలందరికీ ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని బీజేపీ 2014, 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందనీ, పదేండ్లు గడిచినా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఐదేండ్లలో రెండు లక్షల ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించడం ఎన్నికల లబ్ధికోసమే తప్ప పేదవారికి న్యాయం చేయాలన్న ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని విమర్శించారు. సామాన్యుడి వేదనను మోదీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.