– ట్రెసా, గాయత్రిలకు నిరాశ
– థారులాండ్ మాస్టర్స్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నీలో వర్థమాన షట్లర్ అష్మిత చాలిహ మెప్పించింది. మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఇండోనేషియా అమ్మాయి నురుమిపై 21-14, 19-21, 21-13తో మూడు గేముల మ్యాచ్‌లో విజయం సాధించింది. 57 నిమిషాల మ్యాచ్‌లో క్వాలిఫయర్ అష్మిత ఆకట్టుకుంది. తొలి గేమ్‌ను సులువుగా సొంతం చేసుకున్న అష్మితకు రెండో గేమ్‌లో గట్టి పోటీ ఎదురైంది. 19-15తో అష్మిత ఆధిక్యంలో నిలిచినా నురుమి వరుస పాయింట్లతో పుంజుకుంది. 21-19తో మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. డిసైడర్‌లో అష్మిత రెచ్చిపోయింది. ఆరంభం నుంచీ ఆధిక్యంలో కొనసాగింది. 11-3తో విరామ సమయానికి ఎదురులేని ఆధిక్యం సాధించింది. 21-13తో అలవోకగా మూడో గేమ్ గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. నేడు సెమీస్‌లో నాల్గో సీడ్ సుపనిద (థారులాండ్)తో అష్మిత తలపడనుంది. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జంట ఓటమి పాలైంది. 12-21, 21-17, 21-23తో నాల్గో సీడ్ ఇండోనేషియా జోడీ చేతిలో పోరాడి ఓడింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో మిథున్ మంజునాథ్ సైతం 19-21, 15-21తో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించాడు.