రేపు ఎస్‌వీకేలో ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ జాతీయ సమావేశాలు

– తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మికుల సంఘం అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మికుల సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌) సమావేశాలను ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎస్వీకేలోని టీపీఎస్‌కే హాల్‌లో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొప్పు పద్మ, హైదరాబాద్‌ డీఎఫ్‌సీఎస్‌ జిల్లా అధ్యక్షులు అరుణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం జరిగే జాతీయ సమావేశాలకు కేరళ మత్స్యశాఖ ఫెడరేషన్‌ చైర్మెన్‌ వి.మనోహరన్‌, ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేబశిస్‌ బర్మన్‌, పి.స్టాన్లీ, ఇతర జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. మత్స్యకారులకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియో, ఉచిత చేప పిల్లలివ్వాలనీ, పంచాయతీల పరిధిలోని చెరువులు, కుంటలను మత్స్యశాఖ పరిధిలోకి తేవాలనే డిమాండ్లపై తమ సంఘం తరఫున పోరాడి విజయం సాధించామన్నారు. ప్రతి మత్స్యకారుడికి ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ మార్కెటింగ్‌ వాహనాలు ఇప్పించడంలోనూ, చెరువుల లీజులను తగ్గించడంలోనూ తమ సంఘం కృషి మరువలేనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు వెంటనే మంత్రిని నియమించాలని కోరారు. గత ప్రభుత్వంలో మత్స్య శాఖలో ఉచిత చేప పిల్లల పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల, కలుషితమైన నీరు రావడం వల్ల చనిపోయిన మత్స్య సంపదకు ఇన్సూరెన్స్‌ కల్పించాలనీ, 50 ఏండ్లు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.