– ప్రకృతి సంపదకై ప్రతి జీవినీ కాపాడాలి : పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-గండిపేట్
మానవ అభివృద్ధి కోసం జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తూ ప్రకృతి సంపదను పెంచాలని దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపల్ పరిధిలోని నేక్నాంపూర్ పెద్ద చెరువు వద్ద రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు, ధృవాస్ సంస్థ సహకారంతో చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవ వేడుకలకు ఆమె హాజరై మాట్లాడారు. చిత్తడి నేలలు జీవవైవిధ్యం, మానవ శ్రేయస్సు గురించి కమ్యూనిటీలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలన్నారు. మానవ అభివృద్ధికి భూమిపై ఉన్న ప్రతి జీవరాశిని కాపాడాపాలని తెలిపారు. నీటి నుంచి కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయగల దీర్ఘకాలిక సామర్థ్యం చిత్తడి నేలలకు ఉంటాయన్నారు. వ్యర్థాలు, ప్లాస్టిక్, డ్రయినేజీ వేయకుండా చిత్తడి నేలలను రక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని సూచించారు. రామ్‌సర్ ఒప్పందంలో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో 74 వెట్ ల్యాండ్ స్పాట్స్ ఉండగా.. తెలంగాణలో ప్రస్తుతానికి అమీన్‌పూర్‌లో వెట్ ల్యాండ్ స్పాట్‌ను గుర్తించినట్టు తెలిపారు. టూరిస్టులు సేదతీరడానికి వెట్ ల్యాండ్ స్పాట్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయని, అందుకే వాటిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ డ్రైవ్‌లో ఉండాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పోస్టర్ పోటీ, ప్రాజెక్టు ఎగ్జిబిషన్, జీవవైవిధ్యంపై ఫొటో ఎగ్జిబిషన్, పర్య వరణ జీవన శైలిపై ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమ ంలో అధికారి వాణిప్రసాద్, జీవవైవిధ్య మండలి అధికారి ఖార్తాడె, కలెక్టర్ శశాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, దృవాస్ సంస్థ డైరెక్టర్ మధులిక, పాల్గొన్నారు.