– కార్పొరేట్లకు రుణాల మాఫీ.. పేదలకు అన్యాయం
– ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కుట్ర విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి
నవతెలంగాణ-ముషీరాబాద్
పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. కార్పొరేట్‌లకు రుణాలను మాఫీ చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు. దళిత బహు జన ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని, పట్డణ ఉపాధి పథకాన్ని ప్రవేశ పెట్టాలని” డిమాండ్ చేస్తూ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టానికి గతేడాది రూ.89 వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించి 26 శాతం నిధులు పెంచామని పచ్చి అబద్ధం చెబుతోందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికే ఆన్‌లైన్ హాజరు, ఆధార్ బేస్‌డ్ పేమెంట్ విధానం తీసుకొస్తున్నారని తెలి పారు. దేవుడి పేరుతో ఓట్లు దండుకోవడానికి మాయచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల పేదరికం పెరుగుతుంటే.. పాపాలు చేసిన వారే పేదరికంలో ఉంటున్నారని తప్పుడు భావజాలన్ని ప్రచారం చేయడాన్ని తిప్పి కొట్టాలన్నారు. మానవహక్కుల వేదిక జాతీయ సమన్వయకర్త జీవన్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నదన్నారు. ఉపాధి హామీ పరిశోధకులు చక్రధర్ బుద్ద మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ సదస్సులో ఉపాధి హామీ కూలీలు, గృహ కార్మికులు, వీధి వ్యాపారులు, ర్యాక్ పిక్కర్స్, స్వామి వివేకనందా నగర్ బాధితులు తమ గోడు వినిపించారు. ఎన్‌ఏపీఎం జాతీయ నాయకులు మీరా సంఘ మిత్ర, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, వివిధ సంఘాల నాయకులు ఇందిర, పిరోజ్, మనోహర్ పాల్గొన్నారు.