– ముగ్గురు మృతి, 200 మందికి గాయాలు
నైరోబి: కెన్యా రాజధాని నైరోబీలో భారీ పేలుడు జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ పేలుడులో ముగ్గురు మరణించగా, సుమారు 200 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార ప్రతినిధి ఐజాక్ మున్వర్ తెలిపారు. నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలో కంటైనర్ కంపెనీలో పేలుడు జరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. గ్యాస్ కంటెయినర్‌లతో లోడైన ట్రక్కు పేలడంతో దుస్తులకు సంబంధించిన గొడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం తీవ్రతకు కంపెనీకి చెందిన రెండు భవనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అనేక అపార్ట్‌మెంట్ సముదాయాలకు మంటలు వ్యాపించాయి. పలు వాహనాలు, నివాసాలు దగ్థమయ్యాయి. వందల సంఖ్యలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.