అమ్మాన్: జోర్డాన్‌లో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు సహా 30 మంది ఫోన్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. వీరి ఫోన్‌లను ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసెస్‌తో హ్యాక్ చేసినట్లు డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌ గురువారం ప్రకటించింది. 2020 నుండి గతేడాది నవంబర్ వరకు ఈ హ్యాకింగ్ క్రమం కొనసాగినట్లు తెలిపింది. అయితే జోర్డాన్ ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడినట్లు పేర్కొనలేదు. కానీ ఈ పెగాసెస్‌ను నిర్వహించే ఇద్దరు ఆపరేటర్లకు జోర్డాన్ ప్రభుత్వంతో సంబంధం ఉందని యూనివర్శిటీ ఆఫ్ టొరంటో ఆఫ్ సిటిజెన్ ల్యాబ్‌లోని డిజిటల్ పరిశోధకులు 2022 హ్యాకింగ్ బాధితుల నివేదికలో వెల్లడించారు. అయితే ఈ నివేదికపై జోర్డాన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ప్రభుత్వానికి తప్ప తమ ఫోన్‌లను లక్ష్యంగా చేసుకోవాలని ఎవరికి ఉంటుందని ఆ ప్రాంతానికి చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఆడమ్ కూగుల్ ప్రశ్నించారు. ఆయన ఫోన్ కూడా హ్యాకింగ్‌కు గురైంది. మహిళలు, కార్మికుల హక్కులు, ఖైదీల కోసం పోరాడే న్యాయవాది హలా అహద్, ప్రముఖ పాలస్తీనియన్-అమెరికన్ జర్నలిస్ట్, కాలమిస్ట్ దావూద్ కూతాబ్ ఫోన్లు కూడా 2022 ఫిబ్రవరి -2023 సెప్టెంబర్ మధ్య మూడు సార్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. వీరు కాక మరో 15 మంది జర్నలిస్టులు, మీడియా వర్కర్లు కూడా బాధితుల్లో వున్నారు. గతంలో జోర్డాన్ ప్రభుత్వానికి, ఇజ్రాయిల్ ఎన్‌ఎస్‌ఒ గ్రూపుకు మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జోర్డాన్‌లో పెగాసెస్ బాధితుల సంఖ్య అధికంగానే ఉండవచ్చని యాక్సెస్ నౌ వ్యాఖ్యానించింది. దీనిపై ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌ను సంప్రదించామని, వారు ఇంకా స్పందించలేదని హ్యూమన్ రైట్స్ వాచ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.