న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మరోసారి ఈడి విచారణకు గైర్హాజరయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇప్పటి వరకు ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. ఈడి సమన్లు చట్టవిరుద్ధమని, ఆయనను అరెస్ట్ చేయడమే వారి ఏకైక లక్ష్యమని ఆప్ విమర్శించింది. ఈ రోజు కూడా కేజ్రీవాల్ ఈడి విచారణకు హాజరుకావడం లేదని ఆప్ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము చట్టబద్ధమైన సమన్లకు కట్టుబడి ఉంటామని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాని మోడీ లక్ష్యమని, దీనిని అనుమతించబోమని మండిపడింది. ఈడి సమన్లు రాజకీయ ప్రేరేపితమైనవని, చట్టవిరుద్ధమైనవని ఆప్ ధ్వజమెత్తింది. లిక్కర్ కేసులో మొదటిసారి ఆయన నవంబర్ 2వ తేదీన సమన్లు ఇచ్చింది. డిసెంబర్ 21న రెండోసారి, జనవరి 3వ తేదీన మూడోసారి, జనవరి 13వ తేదీన నాలుగోసారి, జనవరి 31న ఐదోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడి ఆదేశించింది. ఈ సారి ఆయన హాజరు కాకుంటే.. అరెస్ట్ వారెంట్ కోసం ఈడి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.