రాష్ట్రంలో దొంగలు అధికారంలోకి వచ్చారు

– మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభలో కేటీఆర్‌
నవతెలంగాణ-ఘట్‌కేసర్‌
రాష్ట్రంలో దొంగలు అధికారంలోకి వచ్చారు.. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మేడ్చల్‌ జిల్లా ఘట్కేసర్‌ మండలం కొర్రెముల చెరుకు బాలయ్య గార్డెన్‌లో ఎమ్మెల్యే మలారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. లంకె బిందెలున్నాయని వచ్చి చూస్తే ఖాళీ కుండలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అనడం దురదృష్టకరమన్నారు. లంకె బిందెల కోసం రాత్రిపూట దొంగలు గడ్డపారలు, తట్టలు పట్టుకొని వస్తారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే దొంగలు అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. సచివాలయంలో లంకె బిందెలుండవని కంప్యూటర్లు, పైళ్ళు, జీవోలుంటాయని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకపోతే వెంటాడి భరతం పడతామని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.2500 ఇస్తానని మాట ఇచ్చారని, దానికోసం రాష్ట్రంలో కోటి 57 లక్షల మంది ఆడపడుచులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారని భరోసా కల్పించారు. ఢిల్లీలో మన గొంతు వినిపించాలంటే మనం పార్లమెంటులో ఉండాల్సిందేనని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా గట్టిగా నిలబడి బీఆర్‌ఎస్‌ నాయకులను గెలిపించుకుందామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాట తేల్చే సమయం ప్రధాని మోడీకి లేదన్నారు. కృష్ణా జలాల కోసం పోరాటం బీఆర్‌ఎస్‌ వల్లే సాధ్యపడుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మన హక్కులను కేంద్రం వద్ద తాకటు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి బీటలు పారిందని, ఇప్పుడు ఆ కూటమిలో ఎవరూ లేరన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి నిరంతరం మేడ్చల్‌ ప్రజల కోసం పరితపించే వ్యక్తి అన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గ ప్రజలకు వాచ్‌మెన్‌గా పనిచేస్తానని మల్లారెడ్డి అన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, పీర్జాదిగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, బోడుప్పల్‌ మేయర్‌ బుచ్చిరెడ్డి, ఘట్కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్యయాదవ్‌, పోచారం మున్సిపల్‌ చైర్మెన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, మల్లారెడ్డి హెల్త్‌సిటీ చైర్మెన్‌ చామకూర భద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమేష్‌ ప్రధానకార్యదర్శి పన్నాల కొండల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.