కవి నిర్మాణకౌశలం ‘ఖర్జూరం’

వి నిర్మాణకౌశలం 'ఖర్జూరం'కవికి జీవనాడి కవిత్వం. కవి ఏ వస్తువును చూసినా, దృశ్యాన్ని చూసినా కవిత్వం చేసే దాకా వదిలిపెట్టడు. పూలల్లో అందాన్ని, పండ్లల్లోని తీయదనాన్నే కాదు, గాయాల పాలయిన చెట్టును, విరిగిన కొమ్మలను గూర్చి కూడా ఆలోచిస్తాడు. కవిత్వం రాసే క్రమంలో మెదడుపొరలను వొలిచి కవితా వాక్యాలుగా కూరుస్తాడు. తపన చెందే కవి వస్తువును చూసే దృష్టి కోణం భిన్నంగా ఉంటుంది. దానికి అనుభవం, అవగాహనలు తోడయితే మొయిదా శ్రీనివాసరావు కవితలాగుంటుంది. ‘ఖర్జూరం’ పేరుతో వారు రాసిన కవితను చూస్తే ఈ కవి నిర్మాణకౌశలం స్పష్టంగా అర్థమవుతుంది.
సాధారణంగా వ్యక్తులు ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్‌ తింటుంటారు. సలాడ్స్‌ తాగుతుంటారు. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ జీవనవిధానాన్ని మెరుగుపరుచుకుంటారు. కవి తినేటప్పుడు కూడా సమకాలీన పరిస్థితులను గూర్చి ఆలోచిస్తాడు. డ్రైఫ్రూట్స్‌ తిన్నా, సలాడ్స్‌ తాగినా అక్కడి నుంచి కూడా కవిత్వం రాబట్టడానికే ప్రయత్నం చేస్తాడు. ఒక కవితను నిర్మించే క్రమంలో ఎంతో మదనం చెంది తాను అనుభవిస్తున్న స్థితిలోంచి ఒక వస్తువును రాబడుతాడు. దానికి కవిత్వాన్ని ఆపాదించి ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యపరుస్తాడు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న మొయిదా శ్రీనివాసరావు కూడా ఖర్జురానికి సమకాలీనతను ఆపాదించిన తీరు ఆకోవలోనిదే.
సమకాలీన అంశాలమీద కవిత్వం రాసేటప్పుడు కవికి చాలా నేర్పరితనం అవసరం. లేకపోతే కవిత పూర్తి వచనమవుతుంది. అక్కడి అంశాలను ఒకటి, రెండింటిని కూడగట్టుకొని కవి బచాయించి కవితను నట్టేట ముంచుతాడు. ఇలాంటి కవితలు రాసిన చోటే కవి నిర్మాణకౌశలం బయటపడుతుంది. మొయిదా శ్రీనివాసరావు ఇలాంటి కవితల్లో కూడా తనదైన శైలిని చూపాడు. ఖర్జూరాన్ని పాలస్తీనా సమస్యకు సింబలైజ్‌ చేసి రాయటంలోని వారి సృజన ఆకట్టుకుంది.
కవిత ఎత్తుగడలో సాధారణ వాక్యాలు ప్రయోగించాడు. ఇది కవితలోకి తీసుకువెళ్ళే ఒకానొక మార్గం. పాఠకుడు సులువుగా కనెక్ట్‌ అయ్యే వాక్యాలివి. ఖర్జూరంనుహొ నేటి స్థితిగతులకు అనుసంధానం చేస్తూ కవితను రాశాడంటే కవిత్వానికై ఎంతగా తపిస్తున్నాడో అర్థమవుతుంది.
ఒక శిలలో శిల్పి ఎన్నో రూపాలను దర్శించినట్లు ఖర్జూరంలో కవి ఎన్నో కోణాలను చూసుంటాడు. అందుకే ఖర్జూరం చూడగానే యుద్ధం గుర్తొచ్చింది అన్నాడు. ఇస్లామిక్‌ దేశాలలో ఖర్జూరం వక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ముస్లింలు ఖర్జురాన్ని రంజాన్‌ పండుగ సమయాల్లో, శుభకార్యాల సమయాల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఈ కోణంలో చూస్తే పాలస్తీనా ముస్లింలకు ప్రతీకగా ఖర్జురాన్ని ఉపయోగించినట్లుగా తెలుస్తుంది.
కవితను నడిపించుకుంటూ వెళ్తూ అక్కడి యుద్ధాల వల్ల కలిగిన నష్టాలను, చంటి పిల్లలకై తల్లిదండ్రులు పడే ఆవేదనను ఆర్ద్రంగా చూపాడు. చాలా దేశాలు పిల్లల విషయంలో ఎన్నో సౌకర్యాలు కల్పించటం మనం గమనిస్తాము. వారి హక్కులకు భంగం కలిగిస్తే అక్కడ క్షమించరాని నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి సమయాల్లో కూడా పాలస్తీనా యుద్ధంలో పిల్లలు ఎంత భయానక వాతావరణంలోకి నెట్టివేయబడ్డారో మనకు పూర్తిగా తెలుసు. ఆ అంశాలను సులువుగా కవితలో ప్రవేశపెట్టడం చాలా కష్టం. కానీ ఈ కవి తక్కువ పంక్తులలో ఎక్కువ అర్థం స్ఫురించేలా సమస్యను వాక్యాల్లోకి తీసుకొచ్చాడు.
ఖర్జురాన్ని చేతిలోకి తీసుకున్న దగ్గరనుండి మొదలుపెట్టి వివిధ దశల్లో మార్పుచెందిన ఖర్జూర నమూనాలను సమస్యలోకి తీసుకెళ్ళి కవిత్వంగా మాట్లాడటం కవి ఒడుపు. తడిగా ఉంటే యుద్ధంలో గాయపడ్డ బాలకుడనడం, నమిలి తిన్నప్పుడు తీయగా ఉండే సందర్భాన్ని సైనికుడు క్షేమంగా ఇంటికి చేరాడన్న ఊహగా మలుచడం కవి పరిశీలనాత్మక దృష్టికి తార్కాణాలు. కవితా నిర్వహణ చాలా సులువుగా కనిపిస్తుంది కానీ చాలా గాఢమైనది. అందరికీ సాధ్యపడేది కాదు.
కవితకు ఇచ్చిన ముగింపు గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. కొన్ని సందర్భాల్లో ముగింపునే కవితకు బలాన్నివ్వటం కవితల్లో కనిపిస్తుంది. ఈ కవితలో ఎత్తుగడ నుండి ముగింపు వరకు ఎక్కడ బలాన్ని కోల్పోకపోవడం ప్రత్యేకమైన అంశం నమిలి ఊసాక చూసినపుడు కవి ఖర్జూరం గింజలో బుల్లెట్‌ ను చూడటం చైతన్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. వ్యవస్థలను దొంగదెబ్బ తీస్తున్న శత్రువుల పట్ల నిరసనగా పేర్కొనవచ్చు. తీక్షణమైన కవితా దష్టి ఉంటే తప్ప బుల్లెట్‌ లాంటి ఈ కవితను రాయలేము. కవి మొయిదా శ్రీనివాసరావు కవితగా మలచి విసిరిన ఈ బుల్లెట్‌ గురి తప్పలేదు. చదివిన ప్రతి పాఠకుడి గుండెల్లో ‘ఖర్జూరం’ బుల్లెట్‌ పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.
ఖర్జూరం
నిన్న సాయంత్రం ఖర్జూరం కొన్నాను
తిందామని చేతిలోకి తీసుకున్నాను.
దాన్ని చూడగానే
నాకు యుద్ధం గుర్తొచ్చింది
ఎందరి తల్లుల కన్నీళ్ళు ఇంకిన
ఇసుక గుండెలపై పెరిగిందో
కాస్త దూరంలో ఎవరు కనిపించినా
తప్పిపోయిన తమ పిల్లాడే
తిరిగొస్తున్నాడని భ్రమించే
ఎందరి తండ్రుల ఎడారి ఆశల
ఎండమావులను చూసిందో
యుద్ధంలో దెబ్బతిన్న
పిల్లాడి ఒంటిపై గాయంలా
తడిగా వుంది

నోట్లో వేసి నమిలి తిన్నాక
యుద్దం నుండి
తన భర్త క్షేమంగా తిరిగొచ్చినట్టు
ఓ సైనికుడి భార్య కన్న కలలా
తియ్యగా వుంది
తినేసి…. పిక్కను
బయటికి ఊసినాక చూస్తే
శత్రువుపై పేలడానికి సిద్ధంగా వున్న
తూటాలా అగుపించింది
– మొయిద శ్రీనివాసరావు
– డా||తండా హరీష్‌ గౌడ్‌
8978439551