మనుషులు శ్రమ చేస్తేనే ప్రయోజనం. మనిషన్నప్పుడు ఏదన్న పనిచేస్తూనే ఉండాలి. ఇంట్లోనైనా, బయటనైనా. ‘నిమ్మకు నీరెత్తినట్లు’ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇటువంటి వాల్లను ‘సూసుక మురుసుడు పట్టుక ఏడుసుడు’ అసోంటోల్లు అంటరు. చూస్తే ఎర్ర బుర్రగ మంచిగనే కన్పిస్తరు కాని ఏం పని చేయరు. ఏమన్న అంటే పట్టుకొని ఏడుస్తరు. వీల్లకు ‘పనిరాదు పాట రాదు’ అని ఎక్రిచ్చి పెడుతరు. ఇట్ల ఏడుపు గొట్టోల్లు చాలామందే వుంటరు. వీల్లను ‘అయ్యోడు కాదు అవ్వోడు కాదు అడ్డమైనోన్ని పట్టుకుని జాము ఏడుస్తండు’ అని కూడా అంటరు. కొందరైతే ఆక్షన్‌లు ఎక్కువ వుంటయి, ప్రేమలు తక్కువ వుంటయి. ప్రేమ లేకున్నా ఆలింగనం చేసికున్నట్లు వీల్లను ‘కడుపులేం లేకున్న కాగలిచ్చుకున్నట్లు’ అంటరు. కడుపులేం లేకున్న అంటే కడుపులో దుక్కం లేదని అర్ధంలో వాడుతరు. ఇలాంటి మనుషులు పాత ముచ్చట్లు మస్తు చెప్పుతరు. అవి ఎట్లానంటే ‘సచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చినట్టు’ అంటరు. ఆ బర్రె ఇప్పుడు లేదు, పాల బుడ్డి లేదు. పాల ఇబ్బందీ లేదు కాని అన్ని ఏతులు చెప్పుతరు. ‘మా తాత మీసాల మీద నిమ్మకాయలు నిలబడేవట’ అని కూడా అంటరు. ప్రగల్భాలకు అంతులేదు. ఏదైనా మాట్లాడుతరు. కొందరైతే చూస్తే శ్రమచేసే శ్రమజీవుని లెక్కనే కన్పిస్తడు కాని ఏ పని చాతకాదు. వీల్లను ‘సూపులకు మగాడే కానీ పనికి పనికిరానోడు’ అంటరు. అట్లనే కొందరు సరుదుడు ఎక్కువ చేస్తరు. ఏదో చెయ్యబోయి చేస్తున్నట్లు ఉంటరు. వీల్లను ‘అండ్లేం లేకున్న సదురుడు ఎక్కువ’ అంటూ ఆట పట్టిస్తరు. సామెతలు మనిషి తత్వాన్ని సూటిగా చెప్పుతవి. ఒక్క ముచ్చట దీర్ఘం తీసి చెప్పే బదులు ఒక సామెత దాని తాత్పర్యం అంతా చెప్పుతది.
– అన్నవరం దేవేందర్, 9440763479