బీఆర్‌ఎస్‌ను వీడిన తాటికొండ

Tatikonda who left BRS– కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం..?
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్‌ తాటికొండ రాజయ్య బీఆర్‌ఎస్‌ను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. కాగా, ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజీనామా లేఖను చూపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలలుగా బీఆర్‌ఎస్‌ పార్టీలో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్టు, పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరానని గుర్తుచేసుకన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్‌ చేసినా పార్టీకి విధేయుడిగానే ఉన్నానని, ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోయినా, స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేశానని తెలిపారు. ఓడిపోయిన అనంతరం కూడా బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యలు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఎలా పడిపోతుంది.. అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడమంటే అప్రజాస్వామికంగా పడగొడతారనేది అర్ధమవుతుందన్నారు. వాస్తవంగా పార్టీలో తమ అభిప్రాయాలు చెప్పడానికి పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమూ దక్కడం లేదని వాపోయారు. నియోజకవర్గంలో తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వకుండా పార్లమెంటు టికెట్‌ ఇస్తామని చెప్పారని, పార్టీలో నాకు సరైన గుర్తింపు లేకుండాపోయిందన్నారు. మనోవేదనతోనే బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారా.. అని మీడియా అడిగిన ప్రశ్నకు నా అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా, ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్‌ పార్టీలో చేసే అవకాశం ఉన్నట్టు జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.