– కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
– అసెంబ్లీలో చర్చకు రెడీ
– ఆయన హయాంలోనే ప్రాజెక్టుల అప్పగింత
– ఉమ్మడి రాష్ట్రం కంటే గత పదేండ్లలోనే ఎక్కువ నష్టం
– నీటివాటాలు తేలేవరకు
– కేఆర్‌ఎంబీకి అప్పగించం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో హరీశ్‌రావు, కేటీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులన్నీ వాళ్లు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పునర్విభజన చట్టం నుంచే తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చారన్నారు. ఆదివారం సచివాలయంలో సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అటవీపర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మీడియాతో మాట్లాడారు.
‘కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆరే చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌పై వేయాలని చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం జరిగింది. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు పంచుకోవాలనే విషయమై కేంద్రం కమిటీ వేసింది. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించారు. దానికి అప్పటికే సీఎం కేసీఆర్, అధికారులు అంగీకరించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్టు 2022లో సంతకాలు చేశారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నిర్వహణకు 2023 బడ్జెట్‌లోనే రూ. 400 కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొంది నప్పుడు ప్రాజె క్టులపై కేసీఆర్ పార్లమెంటులో ప్రశ్నించ లేదు. ఇప్పుడు కృష్ణాలో 50 శాతం నీటి వాటా కావాలని మాట్లాడు తున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు ముఖ్య మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే కేంద్రా నికి అప్పగించారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తున్నదని అబద్దాలు చెబుతున్నారు ” అని సీఎం పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో అధిక నిర్లక్ష్యం
”రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏనిమిది టీఎంసీలు తరలించడానికి ఏపీసీఎం జగన్ ప్రణాళిక వేశారు. అందుకు కేసీఆర్ అనుమతిచ్చారు. ఈ మేరకు 5 మే , 2022న జీవో ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో ముచ్చుమర్రి కట్టారు. 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించారు. దానికీ కేసీఆర్ సహకరించారు. గతంలో కృష్ణా నది ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేది. కానీ, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారు. పదవులకోసం పెదవులు మూసుకున్నారు. కమీషన్లకు లొంగారు. వంగారు. జలదోపిడీకి పాల్పడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తిచేసి ఉంటే 10 లక్షల ఎకరాలకు నీరు అందేది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి కంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్ హయాంలోనే జరిగింది. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా కేసీఆర్ పదేండ్లు అదికారంలో ఉండి ఏం చేశారు” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
ప్రాజెక్టులపై శ్వేతపత్రం
కేఆర్‌ఎంబీ సమావేశం మినిట్స్ తప్పు రాశారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. దీనిపై జనవరి 27న మన సాగు నీటిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా సవరించాలని కోరుతూ లేఖ రాశారనీ, తెలంగాణ నీటి హక్కుల కోసం మేం కొట్లాడుతున్నామనీ, కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లక మాయమాటలు చెబుతున్నారని సీఎం విమర్శించారు. నాగార్జునసాగర్ డ్యామ్‌ను జగన్ ఆక్రమిస్తే కేసీఆర్ స్పందించలేదన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.
కేసీఆర్ సపోర్టుతోనే జగన్ ఆ పని చేశారు
కష్ణా పుట్టిన ప్రాంతం నుంచి ఆ నది పారే వరకు ఉన్న ప్రాజెక్టులన్నీ ఆ బోర్డు పరిధిలోకి తేవాలని కేంద్ర మంత్రికి చెప్పామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలం గాణలో ఉన్న నాగార్జునసాగర్‌ను ఏపీ సీఎం జగన్ పోలీసులు తుపాకులతో చుట్టుముడితే కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ధనదాహం వల్లే కష్ణా నది జలాలు తరలిపోయాయి. రోజుకు 14 టీఏంసీల నీళ్లను తెలంగాణకు రాకుండా దోచుకెళ్లారు. దారి దోపిడీ, జల దోపిడీ జరగడానికి కారణం కేసీఆరే. ఆయన సపోర్టుతోనే పోతిరెడ్డి పాడు పేరుతో ఒక పొక్క, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రెండవ పొక్క, ముచ్చుమర్రి పేరుతో మూడవ పొక్క పెట్టారని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడును ఎందుకు అడ్డుకోలేదు…?
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముందుకు సాగకుండా ఏపీ సీఎం జగన్ స్టే తెచ్చారని సీఎం రేవంత్ విమర్శించారు. ”2004లో టీఆర్‌ఎస్ నుంచి నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. పోతిరెడ్డిపాడును విస్తరించినప్పుడు కేంద్రంలో కేసీఆర్, అలే నరేంద్ర మంత్రులుగా వ్యవహరించారు. జనవరి 14, 2020 నాడు కేసీఆర్ ఇంటికి జగన్ వచ్చి కష్ణా జలాలపై ఆరు గంటలు రివ్యూ చేయలేదా? రాయలసీమకు నీటిని తరలించుకోవడానికి కేసీఆర్ గ్రీన్ సిగల్ ఇచ్చారు. కేసీఆర్ కేవలం కమీషన్లకు లొంగిపోయి జగన్‌తో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. కష్ణానదిపై ఉన్న 15 ప్రాజెక్టులను.. కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని 2022 మే 27 నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదా ?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 మేరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. కష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పింది. ఫిబ్రవరి 2 , 2014 నాడు ఆమోదం జరిగిన సమయంలో కేసీఆర్ ఎంపీగా ఉన్నారు. ఈ చట్టానికి బీఆర్‌ఎస్ ఓట్లేసి మద్దతు తెలిపింది. దీనికి బాధ్యత కేసీఆర్, కేశవరావులదే’ అని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఇంజినీర్ మురళీధర్‌రావు ఈ నిర్ణయంపై సంతకాలు పెట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు.
కేఆర్‌ఎంబీకి అప్పగించం:ఉత్తమ్
ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రాజెక్టుల కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు..ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారు..దీనిపై ఆయనకు మాట్లాడే హక్కే లేదు..జగన్, కేసీఆర్ ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేశారో ? ఎత్తిపోతల ద్వారా జగన్ రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని తీసుకెళ్తుంటే, కేసీఆర్ కేవలం రెండు టీఎంసీల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులను నిర్మించాడు” అని విమర్శించారు.
రండి తేల్చుకుందాం..!
అసెంబ్లీ సమావేశాలపై క్యాబినేట్‌లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ‘అవసరమైతే ప్రాజెక్టులపై శాసనసభ ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దాం. ప్రభుత్వం తరపున తాను, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతాం. బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్ రావు ఎంత సేపయినా అసెంబ్లీలో మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే సమావేశాలకు తప్పకుండా రావాలి. డ్రామారావు(కేటీఆర్), హరీశ్‌రావు, కవితారావు అందరూ రావాలి. అవసరమైతే బట్టలు పట్టుకుని రండి. ఎవరు తెలంగాణను ముంచారో తేల్చుదాం. కాలునొప్పి, కంటి నొప్పి అని కేసీఆర్ డ్రామాలు చేయొద్దు. కేసీఆర్‌కు అధికారం పోయాక ఎక్కడ నొప్పి పుడుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశాడు. దాన్ని తిరగరాసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలను కేంద్రప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటి నుంచి ప్రతి సమావేశానికి వెళ్లి తమ వాదనలు వినిపిస్తాం. తెలంగాణ లంకె బిందెలాగా ఉండేది. కానీ కల్వకుంట్ల కుంటుంబం దోచుకొని మట్టి బిందెను పెట్టారు. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని గజదొంగలంటారని’ అని సీఎం వ్యాఖ్యానించారు.