– తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యేక క్యాంపు
– 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కాగజ్‌ఘాట్ సిరి రిసార్ట్‌కు తరలింపు
– 12న బలపరీక్ష ఎదుర్కోనున్న నితీష్ ప్రభుత్వం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బీహార్ రాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెలంగాణ వేదిక అయింది. ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలివచ్చారు. 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ మదన్మోహన్ ఈ క్యాంపునకు తరలి వచ్చిన వారిలో ఉన్నారు. ఈ నెల 12వ తేదీన నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొననుంది. అప్పటి వరకు బీహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం పరిధిలోని కాగజ్‌గట్ సిరి రిసార్ట్‌లో విడిది కానున్నారు. వారిని భారీ పోలీసు బందోబస్తు మధ్య క్యాంపునకు తరలివచ్చారు. ఈ క్యాంపు.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సారథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కనుసనల్లో కొనసాగుతుంది. జేడీయూ అధినేత నితీష్‌కుమార్ ఇండియా కూటమిలో నుంచి ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి చేరిన విషయం తెలిసిందే. దాంతో బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడింది. ఇటీవల జేడీయూ, బీజేపీ కూటమి ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ తరుణంలో నితీష్‌కుమార్ ప్రభుత్వానికి కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించుకుంది. కాగా ఈ నెల 12వ తేదీన నితీష్‌కుమార్ బల పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. కాంగ్రెస్‌కి మొత్తం 19మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 16 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కాగజ్గట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు చేరుకున్నారు. వీరు సుమారు 7 రోజుల పాటు సిరి రిసార్ట్‌లో ఉండనున్నారు.