– క్యాబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఏ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక, బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏం చేయాలో, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు, సూచనలను అందించాలని సీఎం రేవంత్ సబ్ కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం తెలిపారు.