వివేకానంద నగర్‌ బస్త్తీవాసులకు ‘డబుల్‌’ ఇండ్లు కేటాయించాలి

వివేకానంద నగర్‌ బస్త్తీవాసులకు 'డబుల్‌' ఇండ్లు కేటాయించాలి– సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ నియోజకవర్గ కార్యదర్శి దశరథ్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌ డివిజన్‌లోని స్వామి వివేకనంద నగర్‌ బస్తీ వాసులకు వెంటనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించాలని సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ నియోజకవర్గ కార్యదర్శి దశరథ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ డివిజన్‌లో ఇటీవల అక్రమంగా కూల్చేసిన ఇండ్లకు నిరసనగా వివేకానంద నగర్‌ బస్తీవాసులు చేస్తున్న నిరాహార దీక్షలో ఆయన పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దశరథ్‌ మాట్లాడుతూ.. పేదల ఇండ్లను కూల్చివేస్తే ఎవరూ అడ్డుకోరనే అహంకార ధోరణితో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల ఇండ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వివేకనంద నగర్‌ బస్తీవాసులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వారికి న్యాయం జరిగే వరకూ మద్దతుగా పోరాటాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.