– జిల్లాలో 23,374 మంది దరఖాస్తులు..
– 17,985 మంది అర్హులుగా గుర్తింపు.
– మొదటి విడతలో 1800 మందికి అందిన రుణాలు..రెండో విడత కోసం అర్హుల ఎదురుచూపు..
– కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొని ఉన్నది..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రూ.లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్న బీసీ లబ్దిదారుల్లో ఆయోమయ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రావడంతో.. ఆర్థిక సాయం అందుతుందా…. లేదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని బీసీలలో 15 వర్గాలకు చెందిన 1800 మందికి మొదటి విడత రూ. లక్ష ఆర్థిక సాయం అందింది. ఆ తరువాత నిధులు రాక పోవడంతో పాటు ఎన్నికల ప్రణాళిక నియమాపళి అమల్లోకి రావడంతో పథకం ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
జిల్లాలో ఇలా.. సాధారణంగా బీసీ కార్పోరేషన్ ద్వారా అర్హులైన వారికి సబ్సీడిపై బ్యాంకు రుణాలు అందించే వారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో ఒక సారి మాత్రమే రాయితీ రుణాలను అమలు చేసింది. ఆ తరువాత దాదాపు ఆరు సంవత్సరాలుగా అలాంటి రుణాలు అందించలేదు. ఈ తరుణంలో బీసీలను ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు బంధు పేరుతో రూ. లక్ష పథకం తీసుకొచ్చి దరఖాస్తులు స్వీకరించగా జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 23,374 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తరువాత ఎంపీడీవోల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పర్యటించి దరఖాస్తులను పరిశీలించి 17,985 మందిని అర్హులను గుర్తించారు. ఈ జాబితా ఉన్నతాధికారులకు నివేదించారు.
మెదటి విడతలో 1800 మందికి లబ్ది.మొదటి విడతగా నియోజకవర్గానికి 300 చొప్పున జిల్లాలోని హుజుర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతూర్తి నియోజకవర్గాలకు 1200 మందిని ఎంపిక చేసి రూ. 1లక్ష సహాయం అందించారు. ఆ తరువాత ప్రభుత్వం కేటాయించిన నిధులు మిగలడంతో సూర్యాపేట నియోజకవర్గంలో 300 మంది, హుజుర్‌నగర్, కోదాడ, తుంగతూర్తిలో 200 మంది చొప్పున మొత్తం 900 మందిని ఎంపిక చేశారు. ఇందులో కోదాడ 200 మంది మినహా 700 మందికి రూ. 1లక్ష రుణం అందించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 2100 మందిని ఎంపిక చేసి 1800 మందికి రుణాలు అందించారు. కోదాడ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యే నాటికి ఎన్నికల కోడ్ రావడంతో చెక్కుల పంపిని జరుగలేదు.
అర్హత కలిగిన వారు ఎదురుచూస్తున్నారు…బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రేస్ ప్రభుత్వం రావడంతో బీసి రుణాలకు దరఖాస్తులు చేసుకున్న వారు అయోమయంలో పడ్డారు. కాంగ్రేస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తదా.. లేదా అని ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అర్హులకు ఈ పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నారు.