రిజర్వేషన్ల పేరుతో బీజేపీ మోసం

– భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తున్నదని భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యాల యంలో సమాఖ్య రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఉస్తెల సృజన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నీ రాజా మాట్లాడుతూ ప్రధాని మోడీకి మహిళలపై గౌరవం ఉంటె రిజర్వేషన్లను 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నాటి సీపీఐ పార్లమెంట్‌ సభ్యురాలు గీతా ముఖర్జీ అనేక సార్లు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం కోసం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల ఎంపీలు అడ్డుకున్నారనీ, నాటి నుంచి నేటివరకు మహిళలను మోసం చేయడం ఆ నేతల రక్తంలోనే ఉందని విమర్శించారు. మణిపూర్‌లో ఘోర మానవ విషాదం చోటు చేసుకోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలేనని తెలిపారు. కొన్ని నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న హింసను, హత్యలను, లైంగిక దాడులను అరికట్టటంలో, శాంతిని పునరుద్ధరించడంలో మణిపూర్‌ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని చెప్పారు. మోదీ పాలనలో నవ భారతంలో మహిళలకు ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. భారత ప్రపంచ ఛాంపియన్‌లైన మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడటం ఇందుకు నిదర్శనమని తెలిపారు. సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షులు పి దుర్గా భవాని, శ్రామిక మహిళా ఫోరమ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పి. ప్రేమ్‌ పావని, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం. సదాలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎస్‌. ఛాయాదేవి, ముడుపు నళిని, బి. జంగమ్మ, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సహాయ కార్యదర్శి ఫైమీద తదితరులు పాల్గొన్నారు..