– ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ పాలనంతా రాజ్యాంగ హక్కులను హరించడమేననీ, మోడీ హటావో – దేశ్‌కీ బచావో నినాదంతో దేశమంతటా ప్రచారం నిర్వహిస్తామని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. ఆ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌లో రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలై రామన్ మాట్లాడుతూ యువతరం దేశానికి ఇంధనం, ప్రగతికి రథచక్రం లాంటిదన్నారు. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది యువతవల్లే సాధ్యమని చెప్పారు. పాలకుల విధానాల వల్ల యువశక్తి నిర్వీర్యమౌతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 శాతం నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. చదువుకు తగ్గ ఉద్యోగాల్లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు.
మోడీ చెప్పిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలెందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. పైగా లక్షలాది పరిశ్రమలు మూతపడి కోట్లాదిమంది ప్రజలు ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా, ‘బేటీ బచావో- బేటీ పడావో’, అచ్ఛేస్‌లు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోయాయని విమర్శించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఆఫీస్ బేరర్లు వెంకటేశ్వర్లు,రామకృష్ణ, మహేందర్, శ్రీమాన్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.