బలపరీక్ష నెగ్గిన చంపరు సోరెన్‌

Passed the test of strength Don't kill Soren– బాసటగా నిలిచిన కాంగ్రెస్‌, సీపీఐ (ఎంఎల్‌)
రాంచీ : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపరు సోరేన్‌ సోమవారం శాసనసభ విశ్వాసాన్ని పొందారు. సోరెన్‌ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా 29 మంది వ్యతిరేకించారు. జార్ఖండ్‌ శాసనసభలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా 77 మంది సభకు హాజరయ్యారు. వారిలో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఓటింగ్‌ సమయంలో గైర్హాజరు అయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌ను గత నెల 31న ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయడంతో చంపరు సోరెన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
పార్టీ ఫిరాయింపులు జరుగుతాయేమోనన్న అనుమానంతో జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో మకాం వేశారు. బలపరీక్ష నేపథ్యంలో వీరంతా ఆదివారమే తిరిగి రాంచీ చేరుకున్నారు. ఉదయం శాసనసభ సమావేశం కాగానే చంపరు సోరెన్‌ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరచేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌్‌కు జరిగిన అన్యాయాన్ని ఈ రోజు దేశమంతా చూస్తోంది. మీరు రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్లండి. ప్రతి ఇంటిలోనూ హేమంత్‌ అమలు చేసిన పథకాలే కన్పిస్తాయి’ అని చెప్పారు. హేమంత్‌ సోరెన్‌ రెండో భాగంగా (పార్ట్‌-2) ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు.
తమ పార్టీ చంపరు ప్రభుత్వాన్ని సమర్ధిస్తోందని కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ యాదవ్‌ తెలిపారు. హేమంత్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలను, ప్రజలకు కల్పించిన హక్కులను ఈ నూతన ప్రభుత్వం కొనసాగిస్తుందన్న విశ్వాసం తమకు ఉన్నదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని సీపీఐ (ఎంఎల్‌) నాయకుడు వినోద్‌ కుమార్‌ సింగ్‌ విమర్శించారు. అవినీతి అర్థాన్నే బీజేపీ మార్చేసిందని వ్యాఖ్యానించారు. ‘మీరు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉంటే అవినీతిపరులు. అదే బీజేపీలో ఉంటే నీతిమంతులు’ అని అన్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వంటి నేతలు బీజేపీలో చేరగానే వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలను నిలిపివేశాయని గుర్తు చేశారు. నామినేటెడ్‌ ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడు గ్లెన్‌ జోసఫ్‌ గల్‌స్టన్‌ కూడా సొరేన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. మైనారిటీల హక్కులను బీజేపీ కాలరాస్తోందని ఆయన ఆరోపించారు.
విశ్వాస పరీక్ష కోసం ఏర్పాటుచేసిన శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తుండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.