– కరీంనగర్ బీఆర్ఎస్ మీటింగ్‌లో ఓ కార్యకర్త రచ్చరచ్చ
– చెంచాగాళ్లకు పదవులు ఇచ్చారంటూ ఆగ్రహం
– సీనియర్లుగానూ కనీసం పట్టించుకోలేదంటూ ఆవేదన
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్
‘ఇన్నాళ్లూ మమ్మల్ని పట్టించుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాధ్యతలు ఇవ్వలేదు. పదేండ్లు అధికారంలో ఉన్నా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఇప్పుడు పార్టీ ఓడిపోయినంక మళ్లీ ఎన్నికల కోసం మేము గుర్తుకొ చ్చామా?’ అంటూ ఓ కార్యకర్త బీఆర్ఎస్ పెద్దలను నిలదీశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియో జకవర్గస్థాయి సమావేశంలో జరిగింది.
మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతున్న సమయంలో నగరంలోని కిసాన్‌నగర్‌కు చెందిన కామారపు శ్యాం అడ్డుకున్నాడు. వేదికపై ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా పలువురు ప్రముఖులను నిలదీశాడు. ‘ఉద్యమం అప్పటి నుంచి పని చేస్తున్న నాలాంటి వారికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపే లేకుండా పోయింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంతకాలం ఎవరెవరో వచ్చారని, ఇప్పుడు ఎంపీ ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల గుర్తించి మాట్లాడుతున్నారంటూ నిలదీశాడు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సముదా యించే ప్రయత్నం చేసినా వినకుండా సదరు కార్యకర్త పార్టీ నాయకుల తీరును ఎండగట్టాడు. గత ఎన్నికల్లో పని చేసేందుకు తాను, తనలాంటి వారు ముందుకొచ్చినా ఏ బాధ్యతలూ అప్పగించలేదని, అసలైన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని అన్నాడు. బయట నుంచి వచ్చిన చెంచాగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారంటూ పరుష పదజాలంతో నిలదీశాడు.
అదే సమయంలో మరో సీనియర్ కార్యకర్త లేచి ‘నేను గంగుల కమలాకర్ టిక్కెట్ కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాను’ అని, అయినా తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో వారిద్దరినీ కొందరు నాయకులు, పార్టీ శ్రేణులు సముదా యించే ప్రయత్నం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల, మాజీఎంపీ వినోద్ సహా పలువురు ప్రసంగించారు.