ఆశ వర్కర్ల శ్రమ దోపిడిపై గళం ఎత్తుదాం

నవతెలంగాణ – రాయపర్తి
సమయపాలన లేని డ్యూటీలుతో, మోయలేని అధిక పని భారంతో ఇబ్బంది పడుతున్న ఆశ వర్కర్ల శ్రమ దోపిడిపై సిఐటియు గళం ఎత్తుతోందని సిఐటియు రాష్ట్ర నాయకులు కాసు మాధవి, జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ వర్కర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ తేదీన వరంగల్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు చేపట్టబోతున్న సమ్మెను జయప్రదం చేయాలని ఆశ వర్కర్లకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 16వ తేదీన చేపట్టబోతున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఆశా కార్యకర్తలకు గత రెండు నెలల పెండింగ్‌  పారితోషకాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ. 26000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాద భీమా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్ అయిన ఆశాలకు రూ.10,000 పెన్షన్ చెల్లించాలని వ్యాఖ్యానించారు. 45వ ILC సిఫారుసుల ప్రకారం ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం, మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సిఐటియు చేపట్టబోతున్న సమ్మెలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండలం సిఐటియు కార్యదర్శి తుమ్మల సాంబయ్య, నాగమణి, చైతన్య, రాధిక, రేణుక, పద్మ, నరసమ్మ, నీల, శోభ, కళ్యాణి, మాధవి, స్రవంతి, రజిత తదితరులు పాల్గొన్నారు.